ఏజీఐసీఎల్ ఎండీగా ఎస్వీఆర్ శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ
అమరావతి గ్రోత్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(AGICL) ఎండీగా నియమితులైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్వీఆర్ శ్రీనివాస్(శొంఠి వెంకట రత్న శ్రీనివాస్) బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
అమరావతి: అమరావతి గ్రోత్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(AGICL) ఎండీగా నియమితులైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్వీఆర్ శ్రీనివాస్(శొంఠి వెంకట రత్న శ్రీనివాస్) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలోని రాయపూడి ఏపీసీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలోని రెండో ఫ్లోర్‌లోని తన ఛాంబర్‌లో సాయంత్రం 4 గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. AGICL ఎండీగా నియమితులైన శ్రీనివాస్‌కు పలువురు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీనివాస్ నేపథ్యం
1989 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శ్రీనివాస్ మహారాష్ట్ర క్యాడర్‌కు చెందినవారు. పాలనా సంస్కరణలు, పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, పోర్టుల అభివృద్ధి తదితర కార్యకలాపాలలో శ్రీనివాస్ కీలకపాత్ర పోషించారు.
దేశంలోని మౌలిక వసతుల అభివృద్ధిలో మైలురాయిగా నిలిచిన అటల్ సేతు(ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్) ప్రాజెక్టు విశిష్ట పురోగతికై శ్రీనివాస్ కీలక బాధ్యతలు చేపట్టారు. సుమారు 22 కిలోమీటర్ల పొడవుతో దేశంలోనే అతిపెద్ద సముద్ర వంతెనగా నిలిచిన ఈ ప్రాజెక్టు ముంబై–నవీ ముంబై మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడమే కాక ముంబైలోని జేఎన్‌పీటీ పోర్టు(Jawaharlal Nehru Port Trust) కనెక్టివిటీ, దక్షిణ ముంబైలో ట్రాఫిక్ భారాన్ని తగ్గించడంలో కీలకంగా నిలిచింది. ఈ ప్రాజెక్టులో SVR శ్రీనివాస్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
ఈ ప్రాజెక్టు అమలులో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ(JICA) నుంచి లభించిన నిధుల సమర్థమైన వినియోగం, ఇంజినీరింగ్, పర్యావరణం, ఆర్థిక అంశాల సమగ్ర సమన్వయంలో శ్రీనివాస్ ప్రాజెక్టు పురోగతిలో కీలకంగా నిలిచారు. అలాగే, ముంబై పోర్ట్ ట్రస్ట్ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో పోర్టు ఆధారిత పునర్వికాసానికి దిశానిర్దేశం చేస్తూ, సంప్రదాయ కార్గో కార్యకలాపాల నుంచి ఆధునిక లాజిస్టిక్స్, వాటర్‌ఫ్రంట్ అభివృద్ధి వైపు మార్పుకు పునాది పడటంలో శ్రీనివాస్ కీలకంగా వ్యవహరించారు.
మహారాష్ట్రలో పట్టణ మౌలిక వసతులు, గృహనిర్మాణం, రవాణా, భూవినియోగ ప్రణాళికల అభివృద్ధికై శ్రీనివాస్ విస్తృత సేవలు అందించారు. భారీ మౌలిక వసతి ప్రాజెక్టులు, పీపీపీ నమూనాలు, మౌలిక వసతుల సమగ్ర అభివృద్ధి వంటి రంగాలలో ఆయన అందించిన సేవలు అభివృద్ధికి విలువైన మార్గదర్శకంగా నిలిచాయి.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలమేరకు.. ప్రత్యేక వాహక నౌక(SPV)గా ఏర్పాటైన అమరావతి గ్రోత్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(AGICL) ద్వారా రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తామని శ్రీనివాస్ తెలిపారు.
రాజధాని అమరావతి నిర్మాణంలో ఈ క్రింద తెలిపిన ప్రాజెక్టుల కార్యకలాపాలు, సమర్ధవంతమైన నిర్వహణ బాధ్యతలు AGICL పర్యవేక్షించనుంది.
* గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం
* ఎన్టీఆర్ విగ్రహం
* స్మార్ట్ పరిశ్రమలు
* ఐకానిక్ వంతెన
* స్పోర్ట్స్ సిటీ
* రివర్‌ఫ్రంట్ అభివృద్ధి
*రోప్‌వే
* ఇన్నర్ రింగ్ రోడ్(IRR)
* ఇతర ప్రత్యేక ప్రాజెక్టు పనులు