విధులకు గైర్హాజరైన అసోసియేట్ ప్రొఫెసర్ల తొలగింపు

అనుమతి లేకుండా సంవత్సరానికి పైగా విధులకు గైర్హాజరైన 12 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 48 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్ల సేవలను తాత్కాలికంగా రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు జి. రఘునందన్ ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2025-12-17 12:50 GMT

విజయవాడ: అనుమతి లేకుండా సంవత్సరానికి పైగా విధులకు గైర్హాజరైన 12 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 48 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్ల సేవలను తాత్కాలికంగా రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు జి. రఘునందన్ ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత వైద్యులు ఎఫ్.ఆర్. రూల్ 18-A, ఏపీ లీవ్ రూల్స్, 1933లోని రూల్ 5-B నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించడంతో, వారు సేవల నుండి స్వచ్ఛంద రాజీనామా చేసినట్లుగా పరిగణించాల్సి ఉంటుందని, జి.ఓ.ఎంఎస్ నెం.128, 129 (ఫైనాన్స్–FR.I శాఖ), తేదీ 01-06-2007 ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో సంబంధిత వైద్యులకు “సేవలు ఎందుకు రద్దు చేయకూడదు” అనే అంశంపై షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగిందని, ఆ నోటీసులను డీఎంఈ అధికార వెబ్‌సైట్ (https://dme.ap.gov.in)లో ఉంచడంతో పాటు, సంబంధిత మెడికల్ కాలేజీలు మరియు బోధనా ఆసుపత్రుల నోటీస్ బోర్డులపై కూడా ప్రదర్శించినట్లు తెలిపారు.

షోకాజ్ నోటీసులు అందుకున్న వైద్యులు తమ వివరణను ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5.30 గంటల లోపు విజయవాడ, హనుమాన్‌పేటలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరై సమర్పించాలని సూచించారు. నిర్ణీత గడువులో వివరణ సమర్పించని పక్షంలో, వారి సేవలను పూర్తిగా రద్దు చేయడం జరుగుతుందని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ జి.రఘునందన్ ఆ ప్రకటనలో తెలిపారు.

Tags:    

Similar News