ఆ ఇద్దరి భేటీ స్నేహమా.. వ్యూహమా.. రజనీకాంత్ బీజేపీ దూతగానే వచ్చారా?

ఆ ఇద్దరి భేటీ స్నేహమా.. వ్యూహమా.. రజనీకాంత్ బీజేపీ దూతగానే వచ్చారా?

Update: 2023-01-10 15:30 GMT

ఆ ఇద్దరి భేటీ స్నేహమా.. వ్యూహమా.. రజనీకాంత్ బీజేపీ దూతగానే వచ్చారా?

Chandrababu: స్నేహమా.. వ్యూహమా?. ఏపీ రాజకీయం మొత్తం ఇప్పుడు ఈ ప్రశ్న చుట్టే తిరుగుతోంది. ఇందుకు కారణం ఉన్నట్టుండి టీడీపీ అధినేత చంద్రబాబుతో ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ భేటీ కావడమే. అదికూడా జనసేనాని, చంద్రబాబు భేటీ ముగిసిన తర్వాతి రోజే. పైకి దీన్నో స్నేహపూర్వక భేటీ అని ఇద్దరూ చెబుతున్నా.. పొలిటికల్ సర్కిల్‌లో మాత్రం టన్నులకొద్దీ ప్రశ్నలు, రాజకీయ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంతకూ, తలైవా, టీడీపీ అధినేతను ఎందుకు కలిసినట్టు? రజనీ, చంద్రబాబు భేటీ వెనుక కమలం పెద్దలున్నమాట నిజమేనా? అదే నిజమైతే ఏపీ రాజకీయం ఎలాంటి మలుపులు తిరగబోతోంది?

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం.. జనసేనాని ఈ మాట ఎప్పుడైతే చెప్పారో అప్పట్నుంచే ఏపీ పాలిటిక్స్‌ యమ రంజుగా మారిపోయాయి. పవన్‌కు దమ్ముంటే సింగిల్‌గా బరిలో దిగాలని అధికార వైసీపీ.. సింగిల్‌గానో మింగిల్‌గానో అంతా మా ఇష్టం మధ్యలో మీకేంటి నొప్పని సేనాని.. ఇలా ఓ రేంజ్‌లో డైలాగ్ వార్‌ షురూ అయింది. ఆ తర్వాత ఈ పొత్తు పంచాయితీ కాస్త సైలెంట్ అయినా జనసేనాని వైజాగ్ టూర్‌ తర్వాత సీన్ మళ్లీ మొదటికొచ్చింది. ఆ పర్యటనలో పవన్‌ను హోటల్‌ గడప దాటనివ్వకపోవడం లాంటి ఉద్రిక్తతల తర్వాత టీడీపీ అధినేత విజయవాడ వెళ్లి సేనానిని కలవడంతో అసలైన రాజకీయం మొదలైంది. ఆ టైంలో అదిగో మేం ముందే చెప్పాం ఇదంతా పొత్త యవ్వారమే అని వైసీపీ మంత్రులు పంచులమీద పంచులు షురూ చేస్తే.. అబ్బే అది పరామర్శ భేటీనే తప్ప పొత్తు చర్చలేం జరగలేదని అటు టీడీపీ ఇటు జనసేన క్లారిటీ ఇచ్చింది. కట్‌చేస్తే.. ఈసారి కుప్పం టూర్ ముగిసీముగియగానే హైదరాబాద్‌లో టీడీపీ అధినేత నివాసానికి వెళ్లి మరీ పవన్ కళ్యాణ్ భేటీ నిర్వహించారు. ఇంకేముంది మళ్లీ అదే సీన్ అధికార వైసీపీ నేతలు ఇప్పుడేమంటారంటూ ఎదురు దాడికి దిగిపోయారు. పవన్, చంద్రబాబు పొత్తులపై చర్చించారా? లేదా అన్నది కాస్త పక్కనపెడితే.. అది జరిగిన తర్వాతి రోజోనే సీన్‌లోకి ఇండియన్ సూపర్ స్టార్ తలైవా ఎంట్రీ ఇచ్చారు. అసలు రచ్చంతా ఇక్కడే మొదలైంది. ఇందుకు కారణం స్టేట్ పాలిటిక్స్‌లో ఇటీవల తమిళనాడు హీరో విశాల్ రేపిన రచ్చే.

టీడీపీ అధినేత చంద్రబాబుతో ఇండియన్ సూపర్ స్టార్ తలైవా భేటీ చుట్టే స్టేట్ పాలిటిక్స్ తిరుగుతున్నట్టుక నిపిస్తోంది. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో ఇద్దరి మధ్యా ఎలాంటి అంశాలు చర్చకొచ్చాయన్నది మిలియన్ మార్క్ మిస్టరీగా మారింది. అయితే, రజనీకాంత్‌కు స్వతహాగా బీజేపీ సానుభూతిపరుడిగా గుర్తింపు ఉంది. ఇటీవల తలైవాని గవర్నర్‌గా నియమిస్తారనే చర్చ కూడా జోరందుకుంది. నిజానికి.. నార్త్‌లో తప్ప సౌత్‌లో పెద్దగా పట్టులేని బీజేపీ తలైవా లాంటి క్రేజ్ ఉన్న లీడర్ల కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల రాజకీయ ఎంట్రీ ప్రయత్నాన్ని విరమించుకున్న తర్వాత రజనీపై కాస్త ఎక్కువగానే కమలనాథులు ఫోకస్ చేసినట్టు వార్తలొచ్చాయి. ఇకవేళ రజనీకాంత్‌ను సౌత్‌లో ఏ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించినా అటెన్షన్ వేరేలా ఉంటుంది. అందుకే అలాంటి ప్రయత్నాలు చేస్తుందన్న చర్చ జరిగింది. సింపుల్‌గా చెప్పాలంటే రజనీకాంత్‌ను సౌత్‌పై అస్త్రంగా సంధించే ఆలోచన చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే రజనీకాంత్, టీడీపీ అధినేతతో భేటీ అయ్యారు. ఈ అప్డేట్ ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్‌ను షేక్ చేసేస్తోంది. అయితే, టీడీపీ అధినేతతో భేటీకి బీజేపీకి లింకేంటన్న అనుమానం రావొచ్చు. కానీ, కమలనాథుల వ్యూహాలు ఎప్పుడెలా ఉంటాయో అంచనా వేయడం కూడా కష్టమే.

మొన్నామధ్య ఏపీ సీఎం జగన్‌‌తో తమిళనాడు హీరో విశాల్ సమావేశమై మద్దతు తెలిపారు. ఆ సమయంలో నటుడిగా పవన్ కళ్యాణ్, నాయకుడిగా జగన్‌కే నా ఓటు అని స్టేట్ పాలిటిక్స్‌లో చిన్నపాటి ప్రకంపనలే రేపారు. కట్‌చేస్తే.. ఇప్పుడు సౌత్ సూపర్‌ స్టార్, తలైవా రజనీకాంత్‌ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. అంతే కాదు.. ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రియమైన మిత్రుడు రజనీకాంత్‌ను శాలువతో సత్కరించారు. తన స్నేహితుడ్ని కలవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందంటూ చంద్రబాబు ట్విట్‌ చేశారు. ఈ భేటీ అప్డేట్స్ అటుంచితే.. రజనీకంటే ముందు జగన్, విశాల్ భేటీ జరిగింది. దానికి కొద్ది రోజులముందు రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా తమిళ నటుడు విశాల్ పోటీ చేస్తారనే వార్త జోరుగా ప్రచారం జరిగింది. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే చర్చ జరుగుతుండగానే.. విశాల్ ఏపీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ని తాడేపల్లి వెళ్లి కలిశారు. అనంతరం జగన్ అంటే తనకు ఇష్టమని చెప్పిన విశాల్ అలాగని కుప్పం నుంచి తాను పోటీ చేయడం అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు. విశాల్, జగన్ ఎపిసోడ్‌ ముగిసిన కొద్ది రోజులకే రజనీకాంత్‌ చంద్రబాబుని కలయికపై కూడా కొత్త చర్చ జరుగుతోంది. తలైవా ఫాలోయింగ్‌ని ఉపయోగించుకొని చిత్తూరు జిల్లాలోని తమిళనాడుకు దగ్గరగా ఉన్న కుప్పం, నగరి వంటి నియోజకవర్గాల్లో గెలుపు కోసమే అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం కుప్పంలో చంద్రబాబును ఎట్టిపరిస్థితుల్లో ఓడించాలని జగన్ కంకణం కట్టుకోవడమే. కానీ, ఈ భేటీ వెనుక పొత్తు కోణం కూడా ఉందా? అన్న ప్రశ్నకే సమాధానం కష్టమవుతోంది.

నిజానికి.. ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు ఆల్మోస్ట్ ఖాయం అన్న చర్చ జరుగుతోంది. ఇక తేలాల్సింది, తెలియాల్సిందీ బీజేపీ ఏమనుకుంటుందన్నదే. జనసేనతో తామింకా పొత్తులోనే ఉన్నామని కమలం నేతలు పదేపదే చెబుతున్నప్పటికీ టీడీపీతో పొత్తపై ఎలాంటి స్పష్టతా ఇవ్వడంలేదు. ఇంకాస్త గట్టిగా చెప్పాలంటే టీడీపీతో పొత్త ప్రసక్తే లేదనే సంకేతాలు ఇస్తూ వచ్చారు. కానీ, ఇప్పుడు కమలనాథుల ఆలోచన మారిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధీనికి కారణం లేకపోలేదు. ఇంతకాలం వైసీపీ మద్దతు తమదే అని ధీమాగా ఉన్న బీజేపీ.. ఇప్పుడు తమ ప్రభావం కూడా రాష్ట్రంలో ఉంటుందనే మెసేజ్ పంపించాలని భావిస్తోంది. దీనికి 2024 ఎన్నికలే బెస్ట్ ప్లాట్‌ఫామ్‌గా డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జనసేన, టీడీపీలతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. అందుకు చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగే రజనీకాంత్‌ను రంగంలోకి దించిందనేది పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతున్న చర్చ. కానీ, ఈ పొత్తుల కోసమైతే తలైవా ఎంట్రీ ఇవ్వాల్సినంత అవసరం కూడా లేదు. దీంతో రజనీ ఎంట్రీకి ఇంకేదో కారణముందనే అనుమానం మొదలైంది. మొత్తంగా చంద్రబాబుతో తలైవా భేటీ స్టేట్ పాలిటిక్స్‌లో ఎలాంటి మార్పులు తెస్తుందో చూడాలి.

Tags:    

Similar News