విజ్ఞాన్‌లో సంక్రాంతి సంబరాలు
మండలంలోని వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శనివారం సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి.
చేబ్రోలు: మండలంలోని వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శనివారం సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. విజ్ఞాన్స్ యూనివర్సిటీ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కే.రామ్మూర్తినాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ.. సంక్రాంతి అంటే రైతుల పండుగని తెలిపారు. మన పండుగల్లోని విశిష్టతను, శాస్త్రీయతను విద్యార్థులు గుర్తించాలని సూచించారు. ప్రతి విషయాన్ని వినూత్నంగా ఆలోచించాలని పేర్కొన్నారు. పాత పద్ధతులను గుడ్డిగా అనుసరించకుండా సొంత దారులు వెతకాలని తెలిపారు. ఈ సమయంలో రైతు లోకం పంట చేతికొచ్చిన ఆనందంలో ఉంటుందని చెప్పారు.
సంక్రాంతి సంబరాలతో విశ్వవిద్యాలయ ప్రాంగణం కొత్త కళను సంతరించుకుంది. విద్యార్థులు గోమాతను పూజించారు. పొంగళ్లు పొంగించారు. చిన్నారులకు భోగి పళ్లు పోశారు. చెరుకు గడలు అల్లారు. రంగురంగుల ముగ్గులు వేశారు. అనంతరం ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్స్ యూనివర్సిటీ వీసీ ఎంవైఎస్ ప్రసాద్, రిజిస్ట్రార్ ఎంఎస్ రఘునాథన్, రెక్టార్ కె.సత్యప్రసాద్, డీన్ స్టూడెంట్ ఎఫైర్స్ ఎంఎస్‌ఎస్ రుక్మిణి, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.