Nallamala Forest: నల్లమలలో 3 నెలల పాటు జన సంచారం నిషేధం.. పులుల కలయిక సందర్భంగా అటవీశాఖ నిర్ణయం
Nallamala Forest: నల్లమలలో పెరుగుతున్న పులుల సంఖ్య
Nallamala Forest: నల్లమలలో 3 నెలల పాటు జన సంచారం నిషేధం.. పులుల కలయిక సందర్భంగా అటవీశాఖ నిర్ణయం
Nallamala Forest: ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. జులై ఒకటవ తేదీ నుంచి 30 సెప్టెంబరు తేదీ వరకు నల్లమల అటవీ ప్రాంతంలోకీ జనం ప్రవేశం పై నిషేధం విధించారు. పులులకు ఆవాసమైన ఈ అడవిలో ఈ మూడు నెలలు పులుల కలయిక వుండే నేపథ్యంలో ఈ నిబంధనలు విధించారు. దీంతో నల్లమల అటవీ ప్రాంతంలో కొలువు తీరిన ఇష్టకామేశ్వరి దేవి దర్శనం కూడా మూడు నెలల పాటు భక్తులకు దూరమైంది.
ఆంధ్రప్రదేశ్ లోని నల్లమల అటవీ ప్రాంతం పులులకు ఆవాసం. పులుల సంతతి పెరిగేందుకు ఈప్రాంతం ఎంతో దోహద పడుతుందని గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నల్లమల ఫారెస్ట్‌ను టైగర్స్ జోన్ గా గుర్తించాయి. పులుల సంఖ్య పెరగటానికి అన్ని విధాలుగా అనుకూలమైంది నల్లమల అటవీ ప్రాంతం. ఈ మేరకు ఇక్కడ పులుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
పులుల సంతతి పెరిగేందుకు జులై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలు ఎంతో కీలకం. ఈ మాసాల్లోనే పులులు కలుస్తాయి. ఈ నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతంలోకీ ఈ మూడు నెలల పాటు ఎవరు వెళ్ళకుండా అధికారులు తీవ్రమైన ఆంక్షలు విధించారు. పులుల కలయికకు అంతరాయం కలుగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ సమయంలో అటవీ ప్రాంతంలో పులులు స్వేచ్ఛగా తిరుతాయి. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంత సమీపంలోని గ్రామ ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రధానంగా వంట చెరకు కోసం, ఇతర అవసరాల కోసం ఎట్టి పరిస్థితిలో నల్లమల అడవిలోకీ వెళ్ళవద్దని గ్రామ ప్రజలకు అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
నల్లమల అటవీ ప్రాంతంలోనే ఇష్టకామేశ్వరి దేవి కొలువు తీరింది. భక్తుల పాలిట కొంగు బంగారంగా పేరు గాంచిన ఈ అమ్మవారి దర్శనం కోసం భక్తులు పరితపిస్తారు. అయితే ప్రస్తుతం పులుల కలయిక సమయం ఆసన్నం కావటంతో మూడు నెలల పాటు ఇష్టకామేశ్వరి దేవి దర్శనం భక్తులకు లభ్యం కాదు. నల్లమల అటవీ ప్రాంతంలోకి ప్రవేశం పై నిషేధం ఆంక్షలు ఈ భక్తులకు కూడా వర్తిస్తాయి...
జులై ఒకటవ తేదీ నుంచి 30 సెప్టెంబరు తేదీ వరకు అమ్మవారి ఆలయానికి భక్తులు వెళ్లే అవకాశం లేదు... అంతరించి పోతున్న పులి జాతిని కాపాడుకోవల్సిన బాధ్యత ఎంతో ఉందని, నల్లమల అటవీ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే పులుల సంఖ్య పెరుగుతోందని అధికారులు అంటున్నారు.