సీఎంలా ప్రవర్తించడంలేదు అందుకే జగన్ రెడ్డి అని పిలుస్తున్నా
మీ పార్టీలోని కొద్దిమందికే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తే మిమ్మల్ని జగన్ రెడ్డి అనే అంటాన్నారు.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాయలసీమ పర్యటన షురూ అయింది. కడప జిల్లా రైల్వేకోడూరులో ఆయన భారీ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఓ రాష్ట్రానికి సీఎంలా ప్రవర్తించడంలేదు కాబట్టే జగన్ రెడ్డి అని పిలుస్తున్నానని స్పష్టం చేశారు.
మీ పార్టీలోని కొద్దిమందికే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తే మిమ్మల్ని జగన్ రెడ్డి అనే అంటాను. వైసీపీ నాయకులు, కార్యకర్తలు బాధపడినా నేను ఈ మాటను వెనక్కితీసుకోను. నాకు వైసీపీ వాళ్లపై ద్వేషం ఉండదు. హుందాగా వ్యవహరించాలని జగన్ రెడ్డికి చెప్పండి. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురమ్మని చెప్పండి. జగన్ ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లింది కడప స్టీల్ ప్లాంట్ కోసం కాదు, యువతకు ఉద్యోగాలు కోసం కాదు, అణుశుద్ధి కర్మాగారం కోసం వెళ్లారు. ఈ నాయకులు బెంగళూరులోనే, మరెక్కడో ఉంటాయి. ఇక్కడ అణుశుద్ధి కర్మాగారం పక్కనే నివాసం ఉండేవాళ్లు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండాలి" అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకుముందు పవన్ మాట్లాడుతూ, తెలుగు భాషకు చెందిన శిలాశాసనాలు తొలిసారిగా లభ్యమైంది రాయలసీమలోనే అని, కానీ జగన్ రెడ్డి ఇంగ్లీషు మీడియం అంటున్నారని మండిపడ్డారు. కోస్తా జిల్లాల్లోనే విద్య ఎక్కువ అని భావిస్తారని, కానీ కడపలో ఉన్న గ్రంథాలయంలో 80 వేల పుస్తకాలు ఉన్నాయని, విద్య అంతా ఇక్కడే ఉందని తెలిపారు. ఎన్నికల్లో ఓటమిపాలైన తనకు రైల్వేకోడూరులో ఘనస్వాగతం లభించడం పట్ల పవన్ హర్షం వ్యక్తం చేశారు. ఆశయం కోసం పోరాడేవారికి ఓటమి ఉండదన్న విషయం అర్థమైందని అన్నారు.