అన్నయ్య ట్వీట్‌.. తమ్ముడికి హీట్‌..

Janasena: అన్నేమో అందరివాడు తమ్ముడేమో అభిమానుల పాలిట దేవుడు.

Update: 2021-06-26 08:50 GMT

అన్నయ్య ట్వీట్‌.. తమ్ముడికి హీట్‌..

Janasena: అన్నేమో అందరివాడు తమ్ముడేమో అభిమానుల పాలిట దేవుడు. ఎప్పటికైనా అన్న తమ వైపు వస్తాడు..తమ బలం పెంచుతాడని ఆ అభిమానగణం ఎదురుచూస్తోంటే..ఆ అన్నమాత్రం ట్వీట్లతో షాకిస్తున్నాడు. దీంతో ఆయన మంచితనం చివరకు తమను ముంచుతుందేమోనన్న భయం, ఇప్పుడు తమ్ముడు ఫాలోయర్స్ ను వెంటాడుతోందట. ఆ అన్న ఎవరు..? ఆయన తమ్ముడెవరన్నది మీకు ఇప్పటికే క్లారిటీ వచ్చేసిందా? అయితే, ఇరువురి నడుమ ట్వీట్‌ పెట్టిన హీట్‌ వారేంటో చూసెయ్యండి.

మెగా ఫ్యామిలీ అంటే ముందుగా గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి,ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణే వీరిద్దరి తర్వాతే మిగతా ఎవరైనా ఇక సినిమాల్లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న తర్వాత రాజకీయాల్లో సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేశారు చేస్తూ ఉన్నారు ఈ మెగాబ్రదర్స్. ముందుగా 2009 ఎన్నికలకు ముందు వేగంగా రాజకీయ తెరపై ఆవిష్కృతమైన చిరంజీవి ఆ తర్వాత అంతే వేగంగా రాజకీయాలకు దూరమవుతూ వచ్చారు. మహా అయితే ఆరేళ్ల కాలం పాటు చిరంజీవి రాజకీయజీవితం సాగిందనుకోవాలి. ఆ తర్వాత మళ్లీ సినిమాల బాట పట్టిన చిరు తన సెకండ్ ఇన్నింగ్స్ ను వరుస సినిమాలతో బిజీగా మార్చేసుకున్నారు. ఇక ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ సైతం, 2014 ఎన్నికలకు ముందు జనసేనను స్థాపించి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసి బీజేపీ, టిడిపిలతో దోస్తీ కట్టి, ఆ రెండు పార్టీలు పవర్ లోకి వచ్చేందుకు బ్యాక్ బోన్ గా నిలిచారు. ఇక 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి, తన బలం చాటుదామని ప్రయత్నం చేసి, కేవలం ఒక్కసీటుతో పాలిటిక్స్ లో పవర్ చూపలేని పవర్ స్టార్ అన్న విమర్శలను చవిచూశారు.

ఆ తర్వాత బీజేపీతో రాజకీయ పయనం అన్నది తుమ్మితే ఊడే ముక్కులాగా తయారైంది. తిరుపతి ఉపఎన్నిక తర్వాత బీజేపీ, జనసేనలు ఉమ్మడిగా పోరాడిన అంశాలు ఒక్కటీ లేవు. మరోవైపు బీజేపీ కేంద్ర నాయకత్వం ముఖ్యమంత్రి జగన్ తో సన్నిహితంగా ఉండటం, వైసీపీ సర్కార్ తో రహస్య దోస్తీ కొనసాగించటంపై జనసేన ముఖ్యనేతల్లో అసంతృప్తిని తారాస్థాయికి చేర్చుతోంది. మిత్రులెవరైనా తమ రాజకీయ ప్రత్యర్ధి మాత్రం వైసీపీయేనని ఫిక్సయిన జనసేన వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు ప్రజావ్యతిరేక విధానాలపై వీలుచిక్కినప్పుడల్లా విరుచుకుపడుతోంది. ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి మంచితనం తమను ముంచుతుందేమోనన్న చర్చ జనసేనలో మొదలైందట. కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వ వైఫల్యాలపై తాము విమర్శలూ, పోరాటాలూ చేస్తోంటే రికార్డు స్థాయిలో వ్యాక్సిన్ లు వేశారు మీ పాలన అద్భుతమని చిరంజీవి ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేయటం జనసేన క్యాడర్ లో హీట్ ను రాజేసిందట. దానికి ప్రతిగా ముఖ్యమంత్రి జగన్ కూడా చిరంజీవికి రీట్వీట్ ద్వారా ధన్యవాదాలు తెలపటం వీరిని మరింత ఉక్కపోతకు గురిచేస్తోందట.

మూమూలుగా చిరంజీవినీ, పవన్ నూ వేరుచేసి తామెన్నడూ చూడలేదనీ, కానీ చిరంజీవి సడన్ గా చేసే కొన్ని కామెంట్లూ, ట్వీట్లూ ఇతర చర్యలూ తమను రాజకీయంగా దెబ్బతీస్తున్నాయని సదరు జనసేన క్యాడర్ భావిస్తోందట. గతంలో సైతం వైసీపీ సర్కార్ వైఫల్యాలపై తాము పోరాడుతున్న సమయంలో, చిరంజీవి దంపతులు ముఖ్యమంత్రి జగన్ ఇంటికి రావటం, విందు భేటీ జరపడంపై జనసేన క్యాడర్ తలపట్టుకుందట. ఆ తర్వాత సినీరంగంలో పలుసమస్యలపై ఇతర పెద్దల్ని వెంటేసుకుని చిరంజీవి, ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. ఈ దశలో చిరంజీవి, జగన్ ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందనీ, చిరంజీవికి రాజ్యసభ సీటును వైసీపీ ఆఫర్ చేస్తోందనీ, ఇందుకు జగన్ సుముఖంగా ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్ని చిరంజీవి కోటరీ కొట్టిపారేసిందనుకోండి అది వేరే విషయం. ఇలా చిరంజీవి తన మంచితనంతో సినిమా రంగంలో అయినా, రాజకీయరంగంలో అయినా అందరివాడినని అనిపించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు, అటు ఇటూ తిరిగి తమ ఎదుగుదలకు బూమరాంగ్ అవుతున్నాయన్నదే జనసైనికుల అసలు బాధగా కనిపిస్తోందట. ఇటీవల ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని చిరంజీవి తీసుకున్న మంచి నిర్ణయాన్ని సమర్ధిస్తూ, బ్యాంకుల ఏర్పాటులో తమ వంతు పాత్ర పోషించి, బ్యాంకుల నిర్వహణకు జనసేన వైపు నుంచి సపోర్ట్ చేస్తే, చివరకు తమకు పొలిటికల్ డ్యామేజీ కలిగేలాగా చేస్తారా అన్న ప్రశ్నలు జనసేన వర్గాల నుంచివినిపిస్తున్నాయట.

దీంతో వైసీపీ వైఫల్యాలపై తమకు మద్దతుగా నిలవకపోయినా పర్లేదు కానీ వైసీపీ ప్రభుత్వాన్ని పొగడటం మాత్రం ఆపండి చాలు అన్న రిక్వెస్టులు జనసైనికుల నుంచి చిరంజీవికి వెళ్తున్నాయట. వచ్చే ఎన్నికలకు మాకు అండగా ఉండి, గెలుపుకు సహకరించకపోయినా పర్లేదు మా పోరాటాలు మాత్రం దండగగా మారేలా మీ చర్యలు లేకుండా చూడండన్న, వినతులు కూడా చిరంజీవి కోటరీకి చేరుతున్నాయట. అలాగే రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలే ఉంటాయన్న నానుడిని మీ చర్యలతో నిజం చేయకండి మాస్టారూ అని వారు వేడుకుంటున్నారట మేం కూడా రాజకీయ బరిలో ఉన్నాం మాకూ పొలిటికల్ ఫ్యూచర్ కావాలి కాబట్టి వీలైతే చేయి కలపండి, కానీ ప్రత్యర్ధికి పరోక్షంగా సహకరించకండి మొత్తానికి మేం కూడా ఉన్నామని గుర్తించండి అని సినీ స్టైల్లో చిరును వేడుకుంటున్నారట. మరి ఇప్పటికైనా జనసేనను చిక్కుల్లోకి పెట్టే ఇలాంటి కార్యక్రమాలకు బిగ్ బాస్ ఇక చెక్ పెట్టేస్తారా..? లేక తమ్ముడు తమ్ముడే రిలేషన్స్ రిలేషన్సేనని తనదైన ధోరణిలో అన్నయ్య ముందుకు పోతారా అన్నది వేచిచూడాలి.

Tags:    

Similar News