పవన్ కల నెరవేరింది.. జనసేనకు శాశ్వతంగా గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్..
జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈసీ పవన్ కళ్యాణ్‌కు లేఖను పంపింది. ఈ విషయాన్ని జనసేన అధికారికంగా ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేరింది జనసేన పార్టీ.
కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో తాత్కాలికంగా గ్లాస్ గుర్తు జనసేనకు దక్కగా.. ఇప్పుడు ఈ గుర్తును రిజర్వ్ చేయడంతో జనసేన హర్షం వ్యక్తం చేస్తోంది.
సమాజంలో మార్పు కోసం పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ స్థాపించారని జనసేన పేర్కొంది. దశాబ్ద కాలంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోరాటానికి, గడిచిన ఎన్నికల్లో సాధించిన చారిత్రక విజయంతో జనసేన చరిత్ర సృష్టించిందని ఆ పార్టీ తెలిపింది. నేడు నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టిన సందర్భంగా ప్రతి జనసైనికుడికి, వీర మహిళకు, నాయకులకు ట్విట్టర్ వేదికగా జనసేన హృదయపూర్వక అభినందనలు తెలిపింది.
జనసేన 2014లో పోటీ చేయలేదు. 2019లో పవన్ పోటీ చేసిన రెండు సీట్లలో ఓటమి పాలు అయ్యారు. రాజోలులో మాత్రమే ఆ పార్టీ గెలిచింది. ఆ పార్టీకి ఏడు శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సాధించిన విషయం తెలిసిందే. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో.. 2 లోక్ సభ స్థానాల్లో జనసేన పార్టీ విజయాన్ని సొంతం చేసుకుని అరుదైన ఘనతను సాధించింది. ఏకంగా 8 శాతం ఓటు షేర్‌ని సాధించింది. గుర్తు రిజర్వ్ చేయడంతో ఇకపై గాజు గ్లాస్ గుర్తు ఇతర ఏ పార్టీకి.. అభ్యర్థికి కేటాయించరు. ఏ ఎన్నిక జరిగిన కూడా జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు లభిస్తుంది.
ఇక మార్చి 14న జనసేన ఆవిర్భావ సభలు పిఠాపురం వేదికగా నిర్వహించనున్నారు. పార్టీ ప్లీనరీలో పదేళ్ల పార్టీ రాజకీయ ప్రస్థానం ముగించుకుని పదకొండో ఏట అడుగుపెడుతున్న నేపథ్యాన్ని సమీక్షిస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన తొలిసారి పార్టీ ప్లీనరీ జరుపుకోబోతోంది.