AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ భేటీ..చంద్రబాబు మార్క్ నిర్ణయాలతో రాష్ట్రానికి కొత్త ఊపు
నేడు ఏపీ కేబినెట్ భేటీ..చంద్రబాబు మార్క్ నిర్ణయాలతో రాష్ట్రానికి కొత్త ఊపు
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాబోయే బడ్జెట్ సమావేశాలు, పారిశ్రామిక అభివృద్ధిపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా అమరావతి రాజధాని పనులు , పోలవరం ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష జరగనుంది. ప్రభుత్వం చేపడుతున్న సూపర్ సిక్స్ పథకాల అమలుకు అవసరమైన నిధుల కేటాయింపులపై ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని కేబినెట్ భావిస్తోంది.
త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సమావేశాలను 18 నుంచి 21 పనిదినాల పాటు సుదీర్ఘంగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మొదటి రోజు గవర్నర్ ప్రసంగం, ఆపై బడ్జెట్ ప్రవేశపెట్టడం వంటి కీలక ఘట్టాలకు సంబంధించిన టైమ్ టేబుల్‌ను కేబినెట్ ఆమోదించనుంది.
రాష్ట్రంలో గృహ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎంఏవై కింద రాష్ట్ర వాటాగా గృహ నిర్మాణాల కోసం హడ్కో నుంచి రూ.4,451 కోట్ల టర్మ్ లోన్ పొందేందుకు ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. దీనివల్ల నిధుల కొరత లేకుండా పేదల ఇళ్ల నిర్మాణం పూర్తి కావడానికి మార్గం సుగమం అవుతుంది.
ఇటీవల సీఎం చంద్రబాబు నిర్వహించిన దావోస్ పర్యటన విశేషాలను కేబినెట్‌లో వివరించనున్నారు. అంతర్జాతీయ సంస్థలతో కుదిరిన ఒప్పందాలు, రాష్ట్రానికి రానున్న భారీ పెట్టుబడులపై మంత్రులతో చర్చించనున్నారు. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ, ఏఐ టెక్నాలజీ,మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు. అల్లూరి జిల్లాలో ఫైవ్ స్టార్ రిసార్ట్, కన్వెన్షన్ సెంటర్ వంటి పర్యాటక ప్రాజెక్టులకు కూడా అనుమతులు లభించే అవకాశం ఉంది.
రాజకీయంగా వైసీపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి మంత్రులకు గట్టిగా సూచించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు వాస్తవాలను వివరించాలని దిశానిర్దేశం చేశారు. కేబినెట్ భేటీ అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం పర్యావరణ శాఖ అధికారులతో గ్రీన్ కవర్ పెంపుపై, సాయంత్రం 4 గంటలకు రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించనున్నారు.