Ainavilli Vinayaka Temple: భక్తి పేరుతో వ్యాపారం.. అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయంలో పెన్నుల పూజ వివాదం
Ainavilli Vinayaka Temple: భక్తిని ఆసరా చేసుకుని డబ్బులు దండుకునే ప్రయత్నం కోనసీమ జిల్లా పి.గన్నవరం అయినవిల్లిలో ఘటన
Ainavilli Vinayaka Temple: భక్తి పేరుతో వ్యాపారం.. అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయంలో పెన్నుల పూజ వివాదం
Ainavilli Vinayaka Temple: దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోమన్నారు పెద్దలు... అవకాశం వచ్చినప్పుడే జేబులు నింపుకోవాలి అంటున్నారు ఈ దేవాలయం నిర్వాహకులు... ప్రజల నమ్మకం, విశ్వాసం, భక్తిని ఆసరా చేసుకుని దండుకునే పని జోరుగా సాగించేశారు... ఈ వ్యవహారానికి మరో సెంటిమెంట్ కూడా జత చేసి మరి భక్తులను దోచుకుంటున్న వైనం పై స్పెషల్ స్టోరీ...
అవకాశం రావాలి కానీ అందినంత దండుకోవటానికి కొందరు సిద్ధంగా వుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లిలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది... సరస్వతి జయంతి నేపథ్యంలో అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయంలో.. మూడు రోజులు పాటు చదువుల పండుగ పేరుతో ఆలయం నిర్వాహకులు పలు పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు... అందులో భాగంగా తొలి రోజు లక్ష్మి గణపతి పూజ జరిగింది... సప్త నది జాలాలతో స్వామికి అభిషేకం, గణపతి హోం బాగానే జరిగాయి... ఇక చదువుల పండుగ పేరుతో లక్ష పెన్నులకు పూజలు కూడా చేశారు... ఉత్సవాల్లో భాగంగా వసంత పంచమి నాడు ఈ లక్ష పెన్నుల పూజలు జరిగాయి... ఈ పూజలకు వేలాదిగా భక్తులు కూడా తరలివచ్చారు.
వసంత పంచమి పూజల సందర్భంగా పూజలు చేసిన పెన్నులు పిల్లలకు పంపిణి చేస్తామని ఆలయం నిర్వాహకులు ప్రకటించారు. పూజ చేసిన పెన్నులు వాడితే విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయని ప్రతి ఒక్కరికి నమ్మకం.. ప్రత్యేక సెంటిమెంట్ కూడా... మరో వైపు వసంత పంచమి నేపథ్యంలో వేలాదిగా అక్షరాభ్యాస కార్యక్రమాలు జరిగాయి. ఈ సమయంలో పెన్నులు గణపతి పాదాల వద్ద ఉంచి విశేష పూజలు చేశారు... ఇక్కడే ఆలయం నిర్వాహకులు ఓ కమర్షియల్ ఆలోచన చేశారు. భక్తుల సెంటిమెంట్ను క్యాష్ చేసుకునే ఐడియాకు పదును పెట్టారు. గణపతికి గరికపూజలు అంటూ భక్తుల నుంచి డబ్బులు భారీగా వసూలు చేశారు.
గణపతి పూజ, సరస్వతి పూజలో ఉంచిన పెన్ను ఒకటికి 50 రూపాయలు వసూలు చేశారు. ఇదేమిటని ప్రశ్నించే భక్తులకు అది పెన్నులకు వసూలు చేసిన డబ్బులు కాదని, గణపతి పూజకు వసూలు చేసిన రుసుం అని మసిబూసి మారేడు కాయ చేసే ప్రయత్నం గట్టిగానే చేశారు. ఐతే విచిత్రం ఏమిటంటే స్వామి వారి దర్శనం అయిపోయిన తర్వాత, పెన్నులు కావాలి అని వారికి గరిక పూజ టికెట్పై పెన్నులు అమ్ముతుండటం విశేషం. తమ నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్న ఆలయ సిబ్బంది నిర్వాకంపై భక్తులు భగ్గుమంటున్నారు.
పండుగ, పర్వదినం, ఇతర ముఖ్యమైన రోజులు ఏమైనా వస్తే ప్రజలు దేవాలయాలకు వెళ్ళటం, మొక్కులు చెల్లించుకుని పూజలు చేయటం సహజం. దీన్ని అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి దేవాలయం నిర్వహకులు చక్కగా వాడుకున్నారు. పెన్నులు కావాలి అంటే గణపతి పూజకు ఇచ్చే టికెట్ ఇస్తూ సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఐతే అడగని వారికి టికెట్లు కూడా ఇవ్వకుండా కేవలం డబ్బు తీసుకొని పెన్నులు ఇస్తున్నారు. గణపతి పూజ పేరుతో పెన్నులను అమ్ముతూ భక్తుల జేబులు కొల్లగొట్టారు. ఇలాంటి వ్యవహారాలు బహిరంగానే జరుగుతున్నా అధికారులు ఎవ్వరు పట్టించుకోకపోవటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల విశ్వాసం, నమ్మకం, భక్తితో, వారి మనోభావాలతో డబ్బులు ఎలా సంపాదించుకోవాలో అయినవిల్లి దేవాలయం సిబ్బంది ఇప్పుడు నిరూపించి చూపారు. సుమారు లక్ష పెన్నులను అమ్మారు... ఒకొక్క పెన్నుకు 50 రూపాయలు చొప్పున వసూలు చేశారు... ఇక ఇలా వసూలు చేసిన మొత్తాల లెక్కల సంగతి ఆ గణపతికే తెలియాలి అంటున్నారు భక్తులు... పర్వదినాల్లో భక్తుల సెంటిమెంట్ను ఇలా సొమ్ము చేసుకునే విధానం మాత్రం ఎంత మాత్రం మంచిది కాదని పలువురు అంటున్నారు. అధికారులు ఇప్పటికయినా కళ్ళు తెరవండి... భక్తి పేరుతో వ్యాపారం చేసే వారికి తగిన గుణపాఠం నేర్పండి అంటున్నారు స్థానిక ప్రజలు.