నిర్దేశించిన గడువులోగా నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పోలవరం సహా ప్రస్తుతం నడుస్తున్న సాగునీటి ప్రాజెక్టులు, చేపట్టబోయే సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు సీఎం.. ఈ సందర్భంగా గోదావరి - కృష్ణా లింకేజీ ప్రతిపాదనలతోపాటు రాయలసీమలో కరువు నివారణ కోసం చేపట్టాల్సిన కాల్వల విస్తరణ, ఆర్‌అండ్‌బి తదితర ప్రతిపాదనలను సీఎంకు ఇరిగేషన్ అధికారులు వివరించారు.
నిర్దేశిత సమయంలోగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఆర్థికపరమైన అంశాలను పరిశీలించి తుది ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన సూచించారు. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు.
గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంపై సుదీర్ఘంగా చర్చించిన ముఖ్యమంత్రి ప్రతిపాదనల్లో మార్పులు, చేర్పులపై అధికారులకు సూచనలిచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు, రాయలసీమలో కరువు నివారణ కోసం చేపట్టాల్సిన కాల్వల విస్తరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై ముందుకెళ్లాలన్నారు. వీటిపై మరింత అధ్యయనం చేసి, అనుసరించాల్సిన సాంకేతిక పరిజ్ఞానం, నిర్దేశిత సమయంలో ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలన్నారు.
పోలవరం నుంచి విశాఖకు ప్రత్యేక పైప్‌లైన్‌పై కూడా ప్రణాళిక సిద్ధం చేయాలని, పోలవరం, వెలిగొండ, చిత్రావతి, గండికోట ప్రాజెక్టులకు సంబంధించి ఆర్ అండ్ ఆర్‌పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని సీఎం జగన్ పేర్కొన్నారు. పోలవరం మినహా ప్రస్తుతం కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులకు రూ.25,698 కోట్లు, రాయలసీమ కరువు నివారణ పనుల కోసం రూ.33,869 కోట్లు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసం రూ.15,488 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.