Vizag: అట్రాసిటీ కేసుల్లో బాధితులకు తక్షణ న్యాయం అందించాలి
Vizag: విశాఖ జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంపై అవగాహన సదస్సు.
Vizag: అట్రాసిటీ కేసుల్లో బాధితులకు తక్షణ న్యాయం అందించాలి
Vizag: విశాఖపట్నం జిల్లా న్యాయ సేవ సాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ మరియు డివిజనల్ స్థాయి మానిటరింగ్ కమిటీ సభ్యులకు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం మరియు మాన్యువల్ స్కావెంజర్ నిరోధక చట్టాలపై అవగాహన కార్యక్రమం శుక్రవారం జిల్లా కోర్టులో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ ఆర్. సన్యాసినాయుడు గారు మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలను నివారించడంలో కమిటీ సభ్యులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. అట్రాసిటీ ఘటనలు జరగకముందే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల్లో శాంతి, సామరస్య వాతావరణం నెలకొల్పేలా అవగాహన కల్పించాలని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించి ఎస్సీ, ఎస్టీలపై వివక్ష చూపినా లేదా అత్యాచారాలకు పాల్పడినా కఠిన శిక్షలు తప్పవని ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
భూ వివాదాలు, అసైన్డ్ భూముల సమస్యలు సివిల్ కోర్టుల పరిధిలోకి వస్తాయని, పోలీసులు వాటిలో జోక్యం చేసుకోరని స్పష్టం చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు గారు మాట్లాడుతూ, విక్టిమ్స్‌కు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం, సకాలంలో ఆర్థిక సహాయం మరియు పునరావాసం కల్పించడంలో రెవెన్యూ శాఖ వెంటనే స్పందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డిప్యూటీ డైరెక్టర్, సోషల్ వెల్ఫేర్ శ్రీ కె. రామారావు గారు మాట్లాడుతూ, పౌర హక్కుల చట్టం నుండి ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం వరకు ఉన్న వివిధ నిబంధనలను వివరించి, ఎస్సీ, ఎస్టీలకు ఉన్న హక్కులు, రక్షణలను వివరించారు. కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి బాధితుల సమస్యలను యంత్రాంగానికి త్వరితగతిన చేరవేయాలని కోరారు.
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి రేవతి గారు, మాజీ పీపీ శ్రీ ఎస్.ఎస్.ఎస్. వాసు గారు కేసుల విచారణలో ఎదురయ్యే సాంకేతిక అంశాలను వివరించారు. ఏసీబీ ప్రతినిధి శ్రీ అంబేద్కర్ గారు మాట్లాడుతూ కేసుల దర్యాప్తులో కమిటీ సభ్యుల సహకారం అవసరమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఆర్డీవో శేషశైలజ జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు ప్రొఫెసర్ సుబ్బారాయుడు, చొక్కాకుల రాంబాబు, శ్రీమతి కల్పన, శ్రీమతి సుజాత, శ్రీ జోసెఫ్, శ్రీ ఆంజనేయులు తదితరులు పాల్గొని జిల్లాలోని వివిధ కేసులపై చర్చించారు.