Nellore: పసుపుతో క్యాన్సర్‌కు చెక్.. శాస్త్రవేత్త అరుదైన ఆవిష్కరణ

Nellore: ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో వరుసగా 5 ఏళ్లు నిలిచిన నెల్లూరు డాక్టర్ అనుముకొండ వరదరాజులును జాయింట్ కలెక్టర్ ఘనంగా సత్కరించారు.

Update: 2026-04-10 11:37 GMT

Nellore: పసుపుతో క్యాన్సర్‌కు చెక్.. శాస్త్రవేత్త అరుదైన ఆవిష్కరణ

Nellore: నెల్లూరుకు చెందిన విశ్రాంత ప్రొఫెసర్, శాస్త్రవేత్త డాక్టర్ అనుముకొండ వరద రాజులు గారు ప్రపంచవ్యాప్తంగా అరుదైన గౌరవాన్ని అందుకోవడం నెల్లూరు జిల్లాకు ఎంతో గర్వకారణమని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఉదయం నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో నెల్లూరు నవాబుపేట నివాసి, శాస్త్రవేత్త వరదరాజులుని జాయింట్ కలెక్టర్ ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ..

అమెరికాలోని ప్రతిష్టాత్మక స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం ప్రకటించే ప్రపంచంలోని టాప్ 2 శాతం శాస్త్రవేత్తల జాబితాలో నెల్లూరు వాసి వరదరాజులు వరుసగా ఐదు సంవత్సరాలు (2021–2025) స్థానం సంపాదించడం నెల్లూరు జిల్లాకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. 75 ఏళ్ల వయసులో కూడా నిరంతర పరిశోధనలతో ముందుకు సాగుతూ శాస్త్రరంగంలో విశేష కృషి చేయడం యువతకు ఆదర్శమని అన్నారు.

పర్యావరణ అనుకూల నానో-కాంపోజిట్లు, నానో-మెడిసిన్ రంగాల్లో డాక్టర్ వరద రాజులు గారు చేసిన పరిశోధనలు అంతర్జాతీయ గుర్తింపు పొందాయని, ఆయన కృషికి అనేక భారతీయ మరియు అంతర్జాతీయ పేటెంట్లు లభించడం రాష్ట్రానికి గౌరవకారణమని పేర్కొన్నారు. పసుపు, గోమూత్రం వంటి సహజ పదార్థాలతో అభివృద్ధి చేసిన యాంటీ-బాక్టీరియల్ నానో-కాంపోజిట్లు ఆసుపత్రి వినియోగానికి అనువుగా ఉండి, బ్యాక్టీరియా సంక్రమణలను తగ్గించడంలో సహాయపడుతున్నాయని తెలిపారు. ఈ పరిశోధనలకు భారత ప్రభుత్వం నుండి అనేక పేటెంట్లు, థాయ్‌లాండ్‌లో రెండు పేటెంట్లు లభించడం విశేషమన్నారు.

అంతర్జాతీయ జర్నల్స్‌లో 250కి పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించి, బీజింగ్‌లోని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో అనేక సార్లు పరిశోధనల్లో పాల్గొనడం, థాయ్‌లాండ్‌లోని కింగ్ మాంగ్‌కుట్ విశ్వవిద్యాలయంలో బోధన అందించడం ఆయన ప్రతిభకు నిదర్శనమని తెలిపారు. గతంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకోవడం కూడా ఆయన సేవలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.

ఇటీవల అభివృద్ధి చేసిన పసుపు ఆధారిత నానో-కాంపోజిట్ ప్రయోగశాల స్థాయిలో క్యాన్సర్ కణాలను తగ్గించే సామర్థ్యం చూపడం వైద్యరంగానికి ఆశాజనకమని పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణకు భారత ప్రభుత్వ పేటెంట్ లభించగా, భవిష్యత్తులో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

నానో శాస్త్రవేత్త డాక్టర్ వరదరాజులు మాట్లాడుతూ..

తాను ఎక్కడున్నా తనకు జన్మనిచ్చిన నెల్లూరు అంటే ప్రత్యేక అభిమానం అని, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రత్యేకంగా మళ్లీ తనను నెల్లూరుకు పిలిపించి సత్కరించడం మనసుకు చాలా సంతృప్తిగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరులో ప్రాథమిక విద్య పూర్తి చేసి, వి.ఆర్. కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించి, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డీ పొందినట్లు చెప్పారు. 1950 నుంచి1972 మధ్యకాలంలో నెల్లూరులో తన విద్యాభ్యాసం పూర్తి చేసినట్లు చెప్పారు. అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా సేవలందించి 2010లో పదవీ విరమణ పొందినట్లు తెలిపారు.

పదవీ విరమణను ముగింపుగా కాకుండా కొత్త ఆరంభంగా భావించి, పర్యావరణానికి అనుకూలమైన ప్లాస్టిక్‌లు, సాంప్రదాయ భారతీయ పదార్థాలను ఆధునిక నానో-కాంపోజిట్లుగా అభివృద్ధి చేయడంపై పరిశోధనలు చేస్తున్నట్లు చెప్పారు. వైద్యరంగంలో నానోపార్టికల్స్ అధిక ఉపరితల వైశాల్యం వల్ల తక్కువ మోతాదులోనే ఎక్కువ ఔషధ ప్రభావం సాధ్యమవుతుందని, దుష్ప్రభావాలు తగ్గించే అవకాశముందని వివరించారు. తనను నెల్లూరుకి ప్రత్యేకంగా ఆహ్వానించిన జిల్లా కలెక్టర్, జిల్లా అధికార యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తన పరిశోధనలకు అంతర్జాతీయ స్థాయిలో లభించిన గుర్తింపును నెల్లూరు ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఇందుకు సంబంధించిన పత్రాలను జాయింట్ కలెక్టర్ కు అందజేశారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విజయ్ కుమార్, పలువురు జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News