తమ్ముడు అలా.. అన్న ఇలా..

Update: 2019-12-21 10:35 GMT

మూడు రాజధానుల అంశంపై జనసేన మరోసారి స్పందించింది. జీఎన్‌ రావు కమిటీ నివేదిక తర్వాత రాష్ట్ర ప్రజల్లో తీవ్ర గందరగోళం, అయోమయం నెలకొందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితి శ్రేయస్కరం కాదన్న పవన్ దీనిపై మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చిస్తుందని స్పష్టం చేశారు. ఆ తర్వాతే తమ నిర్ణయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తామని అన్నారు. అభివృద్ధి అంటే సంపద సృష్టించే వనరులను ఏర్పాటు చేయడం అని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే అభివృద్ధికి జనసేన కట్టుబడి ఉందని అన్నారు.

మూడు రాజధానుల ఫార్ములకు మెగాస్టార్ చిరంజీవి మద్దతు ప్రకటించారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సీఎం జగన్‌ ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నారని తెలిపారు. మూడు రాజధానుల ఆలోచనను అందరం స్వాగతించాలని నిపుణుల కమిటీ సిఫార్సులు సామాజిక, ఆర్థిక అసమానతలను తొలగించేవిగా ఉన్నాయని వివరించారు. గతంలో అభివృద్ధి, పాలన అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమైందని చెప్పారు. సాగు, తాగునీరు, ఉపాది అవకాశాలు లేక ఊర్లు విడిచిపెట్టి పోతున్న వలస కూలీల భవిష్యత్‌కు, నిరుద్యోగులకు ఈ కాన్సెప్ట్‌ భద్రత ఇస్తుందని తెలిపారు. ఇప్పటికే 3 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో మరో లక్ష కోట్ల అప్పతో అమరావతిని నిర్మిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏంటన్న ఆందోళనలు రాష్ట్ర ప్రజల్లో నెలకొని ఉందని అన్నారు. ఇదే సమయంలో రైతుల్లో నెలకొన్న భయాందోళనలను, అభద్రతా భావాన్ని, ప్రజల్లో ఉన్న అపోహలు, అపార్థాలు నివారించే ప్రయత్నాన్ని ప్రభుత్వం త్వరితగతిన చేపట్టాలని చిరంజీవి సూచించారు.  

Tags:    

Similar News