Rythu Bharosa Kendram in AP: రైతు భరోసా కేంద్రాల్లో మార్కెటింగ్ సేవలు..

Rythu Bharosa Kendram in AP: రైతు కష్టపడి పంటలు పండించినా వాటికి గిట్టుబాటు ధర రాక నానా ఇబ్బందులు పడుతున్నాడు.

Update: 2020-07-28 03:45 GMT
Rythu Bharosa Kendram

Rythu Bharosa Kendram in AP: రైతు కష్టపడి పంటలు పండించినా వాటికి గిట్టుబాటు ధర రాక నానా ఇబ్బందులు పడుతున్నాడు. వీటి వల్ల నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడాల్సిన పరిస్థితి వస్తోంది. ప్రధానంగా రైతులు పండించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించినపుడే వారికి పూర్తిస్థాయిలో ప్రభుత్వ సేవలందినట్టని ప్రభుత్వం సంకల్పించింది. దీనిలో భాగంగా ఇంతవరకు మార్కెట్లలో జరిపే పంట ఉత్పత్తుల లావాదేవీలను ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలకు విస్తరించింది. రైతుకు గిట్టుబాటు ధర రానప్పుడు నేరుగా ఈ కేంద్రాలకు తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తోంది.

రైతుల‌కు ప్ర‌యోజ‌నాలు చేకూర్చేందుకే ఏపీ ప్ర‌భుత్వం రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌తిష్ఠాత్మకంగా రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. అయితే అన్న‌దాత‌ల‌కు మంచి ధ‌ర అందించేందుకు రైతు భరోసా కేంద్రాల్లో మార్కెటింగ్ సేవ‌ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్న‌ట్టు మంత్రి క‌న్న‌బాబు తెలిపారు. ప్రకృతి విధానంలో తూర్పుగోదావరి జిల్లాలో మొద‌టిసారి బీపీటీ 2841 నల్ల రకం బియ్యం సాగును మండపేట మండలంలోని అర్తమూరుకు చెందిన వైసీపీ నేత‌ కర్రి పాపారాయుడు పొలంలో మంత్రి కన్నబాబు, ఎంపీ(రాజ్య‌స‌భ‌) పిల్లి సుభాష్ చంద్రబోస్‌ సోమవారం ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడిన కన్న‌బాబు..రైతులకు మంచి ధర అందేలా సాగుదారుల‌కి , కొనుగోలుదారునికి మధ్య ఆర్‌బీకేల్లోని మార్కెటింగ్ సెంటర్స్ అనుసంధానంగా పనిచేస్తాయ‌ని వివ‌రించారు. సరైన ధర లేకుంటే పంట‌ను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంద‌ని తెలిపారు. ఎటువంటి అవ‌త‌వ‌క‌ల‌కు తావులేకుండా ఏడాదిలో రూ.10,200 కోట్ల సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్ల‌లో జమ చేసిన‌ట్లు మంత్రి వివరించారు. కూలీల కొరతను అధిగమించేందుకు ఈ ఏడాది రూ.1,700 కోట్లతో యాంత్రీకరణ పథకాన్ని అమలు చేస్తున్నట్లు క‌న్న‌బాబు తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 10600 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సహకారం అందుతోందని.. వీటిని మార్కెటింగ్ కేంద్రాలుగా మార్చబోతున్నామని తెలిపారు. అదే విధంగా 200 కోట్ల రూపాయిలతో ఇంటిగ్రేటెడ్‌ ల్యాబులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ''త్వరగా పాడయ్యే పంటలకు సైతం గిట్టుబాటు ధర కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌. అదే విధంగా రైతులకు ఏదైనా ప్రమాదం లేదా మరణం సంభవిస్తే ఏడు లక్షల రూపాయలు ఇచ్చి వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటోంది. ప్రతి రైతు భరోసా కేంద్రంలో 15 లక్షల రూపాయిలు విలువ చేసే వ్యవసాయ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నాం. రైతుకు అన్ని రకాలుగా అండగా ఉండాలన్నదే సీఎం జగన్‌ లక్ష్యం''అని కురసాల కన్నబాబు పేర్కొన్నారు. 

Tags:    

Similar News