చెమటను మాత్రమే నమ్ముకుని పనిచేస్తున్న గొప్ప మనుషుల కోసం ఈ చేదోడు!

Update: 2020-06-10 08:01 GMT
YS Jagan (File Photo)

కొద్దిసేపటి క్రితం 'జగనన్న చేదోడు' పధకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ లో మాట్లాడుతూ పథకం వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే..

"ఈ రోజు చేదోడు అనే ఈ పధకాన్ని ప్రారంభిస్తున్నాం. నిజంగా కొన్ని శతాబ్దాలుగా మన చుట్టూ ఉన్న సమాజంలో ప్రజలకు సేవ చేస్తూ కేవలం తమ చెమటను మాత్రమే నమ్ముకుని పనిచేస్తున్న గొప్ప మనుషుల కోసం ఈ పధకాన్ని ప్రారంభిస్తున్నాం"

"కోవిడ్‌ సమయం, లాక్‌డౌన్‌ సమయంలో వీరి కుటుంబాలు కష్టంగా బతుకుతున్న పరిస్ధితి చూశాం. మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతీ మాట ఒక బైబిల్‌గా ఒక ఖురాన్‌గా ఒక భగవద్గీతగా భావిస్తాను, ప్రతీ మాట కూడా ఖశ్చితంగా అమలుచేస్తాను. నా పాదయాత్రలో చెప్పిన ప్రతీ హమీ అమలులో భాగంగా ఈ రోజు నా రజక, నా నాయీబ్రహ్మణ, దర్జీ వృత్తిలో ఉన్న అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు ఈ రోజు ఈ హమీ అమలు చేయడం చాలా సంతోషాన్నిస్తుంది"

"షాపులున్న రజక, నాయీబ్రహ్మణ, దర్జీ సోదరుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున రూ.247 కోట్లు వారి వారి బ్యాంక్‌ అకౌంట్లలో నేరుగా జమ చేస్తున్నాం. పాత అప్పులకు ఈ డబ్బు జమ చేసుకోలేని విధంగా చేసిన తర్వాత ఈ డబ్బును వారి అకౌంట్లలో వేస్తున్నాం"

గ్రామ వలంటీర్ల ద్వారా వార్డు సచివాలయాల ద్వారా అర్హుల జాబితాను ఎంపిక చేశాం, ఏదైనా అర్హత ఉండి కూడా రాకపోతే ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇప్పటికైనా రాని వారు అర్హత ఉంటే అప్లికేషన్‌ పెడితే వెరిఫికేషన్‌ చేసి ఒక నెలరోజుల్లోగా అందరికీ అందజేస్తాం. ఈ ప్రభుత్వం ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తుంది కానీ ఎలా కత్తిరించాలి అని ఆలోచించే ప్రభుత్వం కాదు.

ప్రభుత్వ పధకాలు ప్రతీ పేదవాడికి అందాలి, నాకు ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే అందాలి, అర్హత లేకపోతే అందకూడదు. కులాలు చూడకూడదు, మతాలు చూడకూడదు, రాజకీయాలు చూడకూడదు, పార్టీలు చూడకూడదు...ఇదే ఈ ప్రభుత్వం ఫిలాసఫి, ఎవరూ రాకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

పాదయాత్రలో చెప్పిన ప్రతీ మాట కూడా చేయగలిగాను అని సగర్వంగా చెప్పగలుగుతున్నా, అమ్మఒడి, రైతు భరోసా, పెన్షన్‌ కానుక, సున్నావడ్డీ పధకం, విద్యా దీవెన, వసతి దీవెన, వాహన మిత్ర పధకం తీసుకున్నా, మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, చేదోడు పధకం తీసుకున్నా, ఇంగ్లీష్‌ మీడియం, ఇళ్ళ పట్టాలు కానీ ఏది తీసుకున్నా కూడా ఏ పధకం తీసుకున్నా గర్వంగా నేను చెప్పగలుగుతున్నా, ఈ ఏడాది కాలంలో రూ. 42, 465 కోట్లు దాదాపుగా 3.58 కోట్ల మందికి నేరుగా వారి బ్యాంక్‌ అకౌంట్లలోకి ఇవ్వగలిగాం

బహుశా రాష్ట్రచరిత్రలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద మొత్తంలో పేదవారికి తోడుగా ఉన్న ప్రభుత్వం ఎప్పుడూ లేదు, దేవుని దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈ కార్యక్రమాలు చేయగలిగాం.

Tags:    

Similar News