విశాఖలో విషవాయువులు చిమ్మి సరిగ్గా రెండేళ్లు.. 15 మంది మృతి.. 12 మందికి రూ.కోటి...

Visakha LG Polymers: ప్రమాదం జరిగి రెండేళ్లైనా స్థానికుల్లో వీడని భయం దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న స్థానికులు...

Update: 2022-05-07 04:56 GMT

విశాఖలో విషవాయువుల చిమ్మి సరిగ్గా రెండేళ్లు.. 15 మంది మృతి.. 12 మందికి రూ.కోటి...

Visakha LG Polymers: విశాఖలో విషవాయువుల చిమ్మి సరిగ్గా రెండేళ్ల గడుస్తుంది. ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలు, గుర్తుగా వేసిన శిలాఫలకాలు శిథిలమయ్యాయి. గ్రామస్తులు ఇచ్చిన భరోసా నిరాశగా మిగిలింది. 2020 మే 7న తెల్లవారుజామున ఆర్ఆర్ వెంకటాపురంలో ఆర్తనాదాలు వినిపించాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకం 15 మంది ప్రాణాలను విషవాయువు పొట్టన పెట్టకుంది.

RR వెంకటాపురంతో పాటు మరో ఐదు గ్రామాల ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రాలేక ఉక్కిరి బిక్కిరి అయ్యారు. తమకు ఏం జరుగుతుందో అని తెలుసుకునే లోపే జరగాల్సిన ఘోర జరిగిపోయింది. అప్పటివరకు తాము నివసిస్తున్నది విషవాయువుల ఒడిలోనే తెలుసుకోలేకపోయారు. ఈ ప్రమాదం జరిగి రెండేళ్ళు అవుతున్నా, స్థానికులు, బాధితులలో భయం ఇంకా కనిపిస్తూనే ఉంది. వెంకటాపురం, అడవివరం, వేపగుంట, పెందుర్తి, చిన ముషిడివాడ, సుజాతనగర్ ప్రాంత వాసులు ఇళ్లు వదిలి రోడ్లపైకి వచ్చారు.

ఇదే సమయంలో విజృంభించిన కోవిడ్‌ ఫస్ట్ వేవ్ మరింత భయభ్రాంతులకు గురి చేసింది. ఈ ప్రమాదానికి గురై ఆయాసం, తలనొప్పి, అజీర్తి సమస్యలతో ఇంకా బాధపడుతున్నామని బాధితులు చెబుతున్నారు.కొంతమంది ఇప్పటికీ దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. స్టైరిన్‌ పీల్చిన కారణంగా గ్రామస్థులకు అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. గతంలో పాలిమర్స్‌ ఫ్యాక్టరీ పరిసరాల్లో రెండు వేల ఎకరాల వరకు సాగు అయ్యేది.

అయితే ఘటన జరిగిన తర్వాత ఫ్యాక్టరీ రంగు మారిన నీళ్ళు పంట భూముల్లోకి పారడంతో పంటలు సరిగ్గా పండటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ పండినా పంటలో నాణ్యత ఉండటం లేదంటున్నారు. ఇక 319 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందించిన నీరబ్‌ కుమార్‌ కమిటీ నివాస ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలను దూరంగా తరలించాలి లేదా గ్రీన్ కేటగిరీ పరిశ్రమలుగా మార్చాలి అంటూ నివేదిక సమర్పించింది. 

ప్రమాదం జరిగి రెండేళ్ళు అవుతున్నా... వెంటాపురం గ్రామస్తులను ఆ దుర్ఘటన ఇంకా వెంటాడుతూనే ఉంది. వెంకటాపురంతో పాటు నందమూరి నగర్‌, వెంకటాద్రి గార్డెన్స్‌, జనతా కాలనీ, పద్మనాభ నగర్‌, ఎస్సీ, బీసీ కాలనీ, కంపరపాలెం కాలనీ ప్రజలు ప్రమాదాన్ని గుర్తు చేసుకుని భయాందోళనకు గురవుతున్నారు. కంపెనీ మూతపడడం, ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపకపోవడంతో పలువురు రోడ్డునపడ్డారు.

LG పాలిమర్స్‌ దుర్ఘటనలో మృతి చెందిన వారికి కోటి రూపాయల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. దీంతో పాటు ప్రమాదం కారణంగా ఇబ్బందులు పడిన చాలా మంది వరకు రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించింది. అయితే ప్రమాదం జరిగిన రోజు మృతిచెందిన 12 మందికి రూ.కోటి చొప్పున పరిహారం అందినా, ఆ తరువాత కొద్దిరోజులకు చనిపోయిన ముగ్గురి కుటుంబాలకు మాత్రం పరిహారం అందలేదని బాధితులు చెబుతున్నారు. అలాగే వెంకటాపురం గ్రామానికి చెందిన సుమారు 150 మందికి నేటికీ ప్రభుత్వం అందజేస్తామన్న రూ.10 వేల పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే మంత్రులు, అధికారులు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కాని రెండేళ్ళు అవుతున్నా ఎటువంటి ఆసుపత్రి లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో రెండు గదులు తీసుకుని మూడు బల్లలు, నాలుగు మాత్రలు, కొన్ని టానిక్కులు పెట్టి అదే ఆసుపత్రి అని హడావడి చేశారని, కనీసం అత్యవసర సమయంలో అయినా ప్రాథమిక చికిత్స అందించే విధంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 

Tags:    

Similar News