KindIndia NGO: మానవత్వమే మతం.. 100 పాఠశాలల్లో ‘ఆర్వో’ ప్లాంట్లు.. ‘కైండ్ ఇండియా’ సేవా యజ్ఞం!
KindIndia NGO: పేదరికం లేని సమాజమే లక్ష్యంగా 'KindIndia' స్వచ్ఛంద సంస్థ అద్భుతమైన సేవలను అందిస్తోంది.
KindIndia NGO: మానవత్వమే మతం.. 100 పాఠశాలల్లో ‘ఆర్వో’ ప్లాంట్లు.. ‘కైండ్ ఇండియా’ సేవా యజ్ఞం!
KindIndia NGO: సమాజంలో వెనుకబడిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా 'KindIndia' మరియు 'Kindwaves India Foundation' సంస్థలు చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయంగా సాగుతున్నాయి. గత ఏడాది కాలంలో లక్షలాది మందికి ఆహారం, తాగునీరు, దుస్తులు వంటి ప్రాథమిక వసతులు కల్పిస్తూ ఈ సంస్థలు సామాజిక బాధ్యతను చాటుకుంటున్నాయి.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పోషకాహారం
రోగులు మరియు వారి సహాయకుల ఆకలి తీర్చేందుకు ఈ సంస్థ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ప్రతి వారం రెండు రోజులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 600 పోషకాహార ప్యాకెట్లను పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం వారానికి రెండు సార్లు జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమాన్ని త్వరలోనే ప్రతిరోజూ నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
మౌలాలి స్కూల్‌లో ‘ఆర్వో’ వాటర్ ప్లాంట్ ప్రారంభం
విద్యార్థుల ఆరోగ్యమే ప్రాధాన్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు సంస్థ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా తిరుమల నగర్ HB కాలనీ, మౌలాలిలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన ఆర్వో (RO) వాటర్ ప్లాంట్‌ను సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కుండ ప్రతాప్ (Kunda Pratap) ప్రారంభించారు. ఈ ఏడాదిలో ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 100 ఆర్వో యూనిట్లను ఏర్పాటు చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం జె. శ్రీనివాస్, ఏఏపిసి చైర్పర్సన్ సంతోష మరియు ఉపాధ్యాయులు పాల్గొని సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.
పండగలు, ప్రత్యేక సందర్భాల్లో పేదలకు కొత్త బట్టలు అందించే కార్యక్రమంలో భాగంగా సుమారు 10,000 మంది చిన్నపిల్లలు మరియు వృద్ధులకు బ్రాండెడ్ దుస్తులను పంపిణీ చేసింది. వివిధ వృద్ధాశ్రమాలు, ఎన్జీవోల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.
"అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడమే మా పరమావధి. భవిష్యత్తులో మరిన్ని సేవలు విస్తరిస్తాం" అని కుండ ప్రతాప్ పేర్కొన్నారు. సమాజంలో మార్పు కోరుకునే వారు, ఈ సేవా యజ్ఞంలో భాగస్వాములు కావాలనుకునే వారు kindindia.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.