Assam Elections: కాంగ్రెస్ ను అస్సాంకు దూరంగా ఉంచాలి: ప్రధాని మోదీ
Assam Elections: అస్సాం లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార ర్యాలీల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీపై ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు ప్రధాని మోదీ
Assam Elections: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం అస్సాంకు చేరుకున్నారు. ఆయన ఈరోజు మూడు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం బార్పేటలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, అస్సాంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి వరుసగా మూడో విజయాన్ని సాధిస్తుందని, కాంగ్రెస్ వంద పరాజయాలను చవిచూస్తుందని ప్రకటించారు. అస్సాంలోని బార్పేటకు చేరుకున్న ప్రధాని మోదీ మాట్లాడుతూ, "ఇక్కడ రోడ్డు మీద కనీసం నిలబడటానికి కూడా చోటు లేదు. ఈ మైదానం కిక్కిరిసిపోయింది. నేను గుజరాత్‌లో ఏళ్ల తరబడి పనిచేశాను. ఒకవేళ నేను ఉదయం పది, పదకొండు గంటలకు ర్యాలీ నిర్వహించాల్సి వచ్చినా ఇంత మందిని సమీకరించలేకపోయేవాడిని. మీరు అన్ని రికార్డులనూ బద్దలు కొట్టారు. ఈసారి అస్సాం ప్రజలు రెండు పనులు చేశారు. మొదటిది, అస్సాంలో బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయాలు సాధించబోతోంది. ఇక జరగబోయే రెండో విషయం ఏమిటంటే, అస్సాం ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, ఢిల్లీలో కొలువుదీరిన కాంగ్రెస్ రాజవంశీకులను అస్సాం ప్రజలు వంద పరాజయాల రికార్డు సృష్టించేలా ఒత్తిడి చేస్తారు." అన్నారు .
బీజేపీ తాను ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌కు అభివృద్ధిపై దార్శనికత లేదు. దానికి దీర్ఘకాలిక ఆలోచనా విధానం కొరవడింది. దాని ప్రభుత్వాలు ఒకటి లేదా రెండు రాష్ట్రాల్లో మాత్రమే ఉంటాయి. అందువల్ల, దాని పనితీరుపై సరైన నివేదిక ఉండదని ప్రధానిమోఢీ విమర్శించారు.
ప్రధాని ప్రసంగం హైలైట్స్..
ప్రధాని తన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ ను తీవ్రంగా విమర్శించారు .
- మన సైనిక కుటుంబాలలో అధిక శాతం మంది అస్సాంలో నివసిస్తున్నారు. కాంగ్రెస్ సైన్యం శక్తిని తక్కువ చేసి చూపడానికి ప్రయత్నిస్తుంది. అది ఎప్పుడూ శత్రువు ఎజెండాకు ఆజ్యం పోయడానికి ప్రయత్నిస్తూనే ఉంది.
- పాకిస్తాన్ రాసి, స్వరపరిచిన, తనకు ఎంతో ఇష్టమైన పాటను కాంగ్రెస్ పాడింది. కాంగ్రెస్ నాయకులకు పాకిస్తాన్‌తో ఉన్న అనుబంధం దేశంపై ఎప్పుడూ తీవ్రమైన భారాన్ని మోపుతుంది.
- కాంగ్రెస్ మన సాయుధ దళాలకు ఏ విధంగా ద్రోహం చేసిందో చెప్పడానికి 'ఒకే ర్యాంకు ఒకే పింఛను' కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. అధికారం కోసం కాంగ్రెస్ ఏదైనా చేస్తుంది. దానివల్ల అస్సాం తీవ్రంగా నష్టపోయింది.
- కాంగ్రెస్‌ను అస్సాంకు దూరంగా ఉంచాలి. కాంగ్రెస్ చొరబాటుదారులకు ఆశ్రయం కల్పించింది. అస్సామీ భూములను అక్రమంగా ఆక్రమించుకోవడానికి కాంగ్రెస్ అనుమతించింది. బీజేపీ-ఎన్డీఏ కూటమి అస్సాంను అటువంటి అక్రమ ఆక్రమణల నుండి విముక్తి చేస్తోంది.
"మీరు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ చొరబాటుదారులకు బహిరంగంగా మద్దతు ఇస్తోంది. అంతేకాకుండా, ఈ అక్రమ ఆక్రమణలపై తీసుకుంటున్న చర్యలను కూడా కాంగ్రెస్ ఇప్పుడు వ్యతిరేకిస్తోంది," అని ప్రధాని అన్నారు.
'చొరబాటుదారుడు' అనే పదాన్ని వాడేవారిని సైతం జైలుకు పంపేలా అస్సాంలో ఒక చట్టాన్ని తీసుకురావాలని కాంగ్రెస్ మాట్లాడుతోందని ప్రధాని ఆరోపించారు. మీరు అలాంటి చట్టాన్ని ఆమోదిస్తారా? కాంగ్రెస్ ఆ చట్టంలోనే చొరబాటుదారులను బాధితులుగా ప్రకటిస్తుంది. ఇక ఇక్కడి మెజారిటీ వర్గానికి చెందిన పిల్లలు ఎప్పుడూ జైలు శిక్ష ముప్పులో ఉంటారు. ప్రతి ఇంటర్వ్యూలో, ప్రతి ప్రసంగంలో కాంగ్రెస్ నాయకులు అలాంటి చట్టం గురించే చర్చిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీపై ప్రధాని విరుచుకు పడ్డారు.