Telangana Assembly Sessions: అసెంబ్లీలో ఈరోజు చర్చకు కీలక బిల్లులు

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో జీఎస్టీ సవరణ బిల్లు, వైద్య విధాన పరిషత్ రద్దు, ఉద్యోగ నోటిఫికేషన్లపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది

Update: 2026-03-25 02:49 GMT

Telangana Assembly Sessions

Telangana Assembly Sessions: తెలంగాణ శాసనసభ సమావేశాలు బుధవారం ఉదయం 10 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన ప్రారంభం కానున్నాయి. ఈరోజు సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను సభ ముందుకు తీసుకురానుంది. అంతేకాకుండా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ వ్యయ పట్టికను సభలో ప్రవేశ పెడతారు. . ముఖ్యమంత్రి, మంత్రులు, విపక్ష నేతల సమక్షంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చ కొనసాగుతుంది.

ఈరోజు శాసన సభలో ప్రభుత్వం ప్రధానంగా రెండు ముఖ్యమైన బిల్లులను ప్రవేశ పెట్టబోతోంది. అందులో మొదటిది 'తెలంగాణ వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) (సవరణ) బిల్లు -2026. పన్నుల విధానంలో మార్పులు, సులభతర వాణిజ్యం లక్ష్యంగా ఈ సవరణను ప్రభుత్వం తీసుకువస్తోంది. ఇక మరో కీలక బిల్లు 'తెలంగాణ వైద్య విధాన పరిషత్ రద్దు బిల్లు-2026'ను ప్రభుత్వం సభకు తీసుకువస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ, వైద్య సేవలను మరింత బలోపేతం చేసే క్రమంలో పరిపాలనా పరమైన మార్పుల కోసం ఈ బిల్లును తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధాన సమస్యలు.. 

ఇక ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు పలు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురానున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సౌకర్యాలు, గోడౌన్ల కొరతపై ఒక ప్రశ్న సభ ముందుకు రానుంది. అలాగే, పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణ పురోగతిపై మరో కీలక అంశం ప్రశ్నోత్తరాల సమయంలో రానుంది.

ఇక విద్యుత్ రంగంలో సంస్కరణల్లో భాగంగా 'సోలార్ మోడల్ స్కీమ్' అమలుపై ఒక ప్రశ్న సమావేశంలో రానుంది. పర్యావరణ హితమైన విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ ప్రశ్న ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారు. అదేవిధంగా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం, కొత్తగా మంజూరు చేసే చౌక ధరల దుకాణాల (రేషన్ షాపులు) ఏర్పాటుపై సభ్యులు ప్రశ్నలు లేవనెత్తనున్నారు.

మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ పనుల పురోగతి గురించి తెలుసుకోవాలని సభ్యులు కోరుతున్నారు. అలాగే, రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీపై కూడా ఒక ప్రశ్న సభ ముందుకు ఈరోజు రాబోతోంది.

ఇక హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి 'సమీకృత రవాణా వ్యవస్థ' (Integrated Transport System) ఏర్పాటుపై కూడా ప్రశ్నలు సభముందుకు రానున్నాయి. అదేవిధంగా నర్సాపూర్ నియోజకవర్గంలోని అల్ప సంఖ్యాక ఆశ్రమ పాఠశాలకు శాశ్వత భవన నిర్మాణంపై ఒక ప్రశ్న ప్రశ్నోత్తరాల సమయంలో సభలో రానుంది.

Tags:    

Similar News