Fuel Crisis in Telangana: తెలంగాణలో పెట్రోల్ కరువు.. బంకుల వద్ద బారులు.. సామాన్యుడి బతుకు ఆగమాగం
Fuel Crisis in Telangana: తెలంగాణవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు విలవిల్లాడుతున్నారు.
Fuel Crisis in Telangana
Fuel Crisis in Telangana: తెల్లవారుజామున ఆఫీసుకెళ్లాల్సిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నుంచి, సరుకులు చేరవేయాల్సిన డెలివరీ బాయ్ వరకు.. ఇప్పుడు అందరి చూపు ఒక్కటే.. ఆ 'పెట్రోల్ నాజిల్' వైపు! తెలంగాణవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత సెగలు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రంలోని గల్లీ నుంచి ఢిల్లీ దాకా చర్చంతా ఇప్పుడు ఇంధనం గురించే. వదంతులా? లేక నిజంగానే కొరత ఉందా? అన్న సందిగ్ధంలో వాహనదారులు బంకుల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు.
నగరంలో నో స్టాక్ బోర్డుల కలకలం
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, ఉప్పల్ వంటి ప్రధాన ప్రాంతాల్లో దృశ్యాలు చూస్తుంటే యుద్ధం వస్తుందేమో అన్నంత భయాందోళనలు కనిపిస్తున్నాయి. కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్లపైనే క్యూ కట్టడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. ఒక్క చుక్క పెట్రోల్ కోసం మూడు, నాలుగు బంకులు తిరిగినా నిరాశే ఎదురవుతోంది. చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారుల్లో ఆందోళన రెట్టింపవుతోంది. అర్ధరాత్రి నుంచి క్యూలో ఉన్నాను, స్టాక్ ఎప్పుడు అయిపోతుందో అని భయంగా ఉంది అంటూ ఒక వాహనదారుడు ఆవేదన వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
సామాన్యుడిపై ప్రభావం
ఈ సంక్షోభానికి మూలాలు వేల మైళ్ల దూరంలోని పశ్చిమాసియా ఉద్రిక్తతల్లో ఉన్నాయి. హోర్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన ఇంధన దిగ్బంధం కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసుదెబ్బతింది. ప్రపంచ దేశాలకు చమురు సరఫరా చేసే ఈ కీలక మార్గంలో అంతరాయం ఏర్పడటం ఇప్పుడు నేరుగా తెలంగాణలోని సామాన్యుడి జేబుపై, జీవనంపై ప్రభావం చూపుతోంది. దీనికి తోడు స్థానికంగా ఆయిల్ కంపెనీల నుంచి సరఫరా తగ్గడం గొడ్డలి పెట్టులా మారింది.
కృత్రిమ కొరతా?
ఒకవైపు ప్రజలు బంకుల వద్ద బారులు తీరుతుంటే, అధికారులు మాత్రం ఇదంతా వదంతులేనని కొట్టిపారేస్తున్నారు. రాష్ట్రంలో సరిపడా నిల్వలు ఉన్నాయని, అనవసరంగా భయాందోళనలకు గురికావద్దని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేస్తోంది. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. కొన్ని చోట్ల వ్యాపారులు కావాలనే 'కృత్రిమ కొరత' సృష్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. "స్టాక్ ఉన్నా కూడా ధరలు పెరుగుతాయనే ఆశతో దాచి పెడుతున్నారా?" అని జనం ప్రశ్నిస్తున్నారు.
రవాణా రంగం అతలాకుతలం
ఈ ఇంధన కరువు ఇలాగే కొనసాగితే రవాణా రంగం కుప్పకూలే ప్రమాదం ఉంది. నిత్యావసర వస్తువుల రవాణా నిలిచిపోతే కూరగాయలు, పాల ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. అంబులెన్స్‌లు వంటి అత్యవసర సేవలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పరిస్థితి విషమించక ముందే ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో (OMCs) చర్చలు జరిపి, పెండింగ్‌లో ఉన్న స్టాక్‌ను బంకులకు చేరవేయాలి. అలాగే, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
పెట్రోల్ అనేది ఇప్పుడు కేవలం ఒక ఇంధనం కాదు.. అది సామాన్యుడి జీవన చక్రం. ఆ చక్రం ఆగకూడదంటే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వదంతులకు చెక్ పెట్టి, పారదర్శకమైన సరఫరాను పునరుద్ధరించడమే ఇప్పుడున్న ఏకైక మార్గం.