Armoor: ఆర్మూర్ లో పట్టపగలే దొంగతనం: పెళ్లి ఇంట్లో 14 తులాల గోల్డ్ ‘కాజేసిన’ కేటుగాళ్లు!

Armoor: ఆర్మూర్ విశాఖ టవర్స్‌లో భారీ దొంగతనం జరిగింది. కుటుంబ సభ్యులు పోచమ్మ గుడికి వెళ్లిన సమయంలో పెళ్లి ఇంట్లోకి చొరబడిన దొంగలు 14 తులాల బంగారం, లక్ష రూపాయల నగదు దోచుకెళ్లారు.

Update: 2026-04-10 05:34 GMT

Armoor: ఆర్మూర్ లో పట్టపగలే దొంగతనం: పెళ్లి ఇంట్లో 14 తులాల గోల్డ్ ‘కాజేసిన’ కేటుగాళ్లు!

ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. పోలీసులు ఒకవైపు 'మన ఊరు - మన భద్రత' అంటూ అవగాహన సదస్సులు నిర్వహిస్తుండగానే, పట్టపగలే దర్జాగా ఓ అపార్ట్‌మెంట్‌లో చొరబడి భారీ దోపిడీకి పాల్పడ్డారు. పట్టణంలోని విశాఖ నగర్ కాలనీలో గల విశాఖ టవర్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

విశాఖ టవర్స్‌లో నివసిస్తున్న వినోద్-సువాసిని దంపతుల కుమార్తె వివాహం అమెరికాలో జరగాల్సి ఉంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం లింబాద్రి గుట్ట వద్ద వేడుకలు ముగించుకున్న కుటుంబ సభ్యులు, గురువారం ఉదయం స్థానిక పోచమ్మ గుడిలో పూజల కోసం వెళ్లారు. వారు ఇంటి నుండి బయలుదేరిన 15 నిమిషాల్లోనే దొంగలు తమ పని కానిచ్చేశారు. ఇంట్లోకి చొరబడిన దుండగులు 14 తులాల బంగారం, రూ. 1 లక్ష నగదు అపహరించుకుపోయారు.

అదే టవర్స్‌లోని మరో పోర్షన్‌లో కూడా దొంగలు ప్రవేశించి వస్తువులను చిందరవందర చేశారు. అయితే అక్కడ ఆభరణాలేవీ దొరకకపోవడంతో పెళ్లి వారి ఇంట్లోనే భారీగా దోచుకున్నారు. సమాచారం అందుకున్న ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, సీఐ సత్యనారాయణ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. అనుమానంపై అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

పట్టణ నడిబొడ్డున, అందరూ చూస్తుండగానే ఇంత భారీ దొంగతనం జరగడం స్థానికంగా కలకలం రేపింది. "పోలీసులు ఒకవైపు భద్రతపై అవగాహన కల్పిస్తున్న సమయంలోనే, పట్టపగలే దొంగలు పంజా విసరడం భద్రతా వైఫల్యమే" అంటూ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి పనుల బిజీలో ఉన్న ఇంట్లో చోరీ జరగడంతో బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Tags:    

Similar News