Dhurandhar 2 Collections: దురంధర్ 2 పదోరోజు కలెక్షన్లు.. అన్ని రికార్డులను ఊడ్చేసిందిగా
Dhurandhar 2 Collections: దురంధర్ 2 ప్రభంజనం ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. వరుసగా పదో రోజు కూడా రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.
Dhurandhar 2 Collections
Dhurandhar 2 Collections: ఒకటి..రెండు..మూడు.. ఇప్పటికి పదిరోజులు. మొదటి షోకి ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో ఇప్పటికీ అదే వరుస. సాధారణంగా ఏ మూవీ అయినా రోజులు గుడుస్తుంటే కలెక్షన్స్ తగ్గుతూ వస్తాయి. మొదటివారం ఎన్ని రికార్డులు కొట్టింది అనేదే లెక్కగా ఉంటూ వచ్చింది ఇన్నిరోజులు. కానీ, దురంధర్ 2 ఆ లెక్కలన్నీ మార్చేసింది. ఐదారు వందల కోట్లు ఖర్చు.. భారీ సెట్టింగ్స్.. విజువల్ ఎఫెక్ట్స్ హోరు.. ఇవన్నీ ఉన్నా కూడా బాక్సాఫీస్ దగ్గర ఏడెనిమిది వందలు రాబట్టడానికి ఆపసోపాలు పడే పరిస్థితి. ఇలాంటి లెక్కలన్నిటినీ 250-300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన దురంధర్ 2 తుడిచిపెట్టేసింది. మొదటి రోజున మొదలైన ప్రభంజనం పదోరోజూ కొనసాగింది.
బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ , ఆదిత్య ధర్‌ల దర్శకత్వంలో తెరకెక్కిన 'ధురందర్: ది రివెంజ్' (ధురందర్ 2) చిత్రం బాక్సాఫీస్ వద్ద రోజురోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన కేవలం 9 రోజుల్లోనే 700 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం, 10వ రోజులోకి అడుగుపెట్టేసరికి భారతీయ చిత్ర పరిశ్రమలో అద్భుతం అని చెప్పుకున్న చిత్రాలన్నిటి రికార్డును బద్దలు కొట్టింది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం, 10వ రోజు (మార్చి 28) నాటికి ఏకంగా రూ. 62.85 కోట్లు వసూలు చేసింది. భారతదేశంలో ఇప్పటివరకు దీని వసూళ్లు రూ. 784 కోట్లు.
దీంతో, ఇది హిందీ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా కొత్త రికార్డు సృష్టించింది. ఇంతకుముందు, 'ధురందర్' మొదటి భాగం (రూ. 58 కోట్లు) 10వ రోజు వసూళ్లలో అగ్రస్థానంలో ఉండేది. ఇప్పుడు, 'ధురందర్ 2' దాని రికార్డును చెరిపేసింది. అంతేకాదు, ఇది పుష్ప 2, బాహుబలి 2, ఛావా, గదర్ 2, స్త్రీ 2, దంగల్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల 10వ రోజు వసూళ్ల రికార్డులను కూడా బ్రేక్ చేసింది.
మన దేశంలోనే కాకుండా, విదేశాలలో కూడా ఈ చిత్రం మంచి ఊపు మీద ఉంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ. 1,151 కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకు విదేశీ మార్కెట్ నుంచి రూ. 296 కోట్లు రాబట్టింది. సుమారు రూ. 250 నుంచి 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, తన నిర్మాణ వ్యయం కన్నా రెండున్నర రెట్లు అధికంగా సంపాదించి అధికారికంగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ నటించిన ఈ మూవీ ఆదివారం (మార్చి 29) షోలు ముగిసేలోగా రూ. 800 కోట్ల మార్కును దాటుతుందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ఈ చిత్రం త్వరలోనే రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరే దిశగా సాగుతోంది. మొత్తం మీద, ఆదిత్య ధర్- రణవీర్ సింగ్ ద్వయం బాలీవుడ్‌కు తిరిగి జీవం పోసిందని చెప్పవచ్చు. ఎందుకంటే, ఎంతోకాలంగా కనీస హిట్ కూడా బాలీవుడ్ నుంచి రాలేదు. ఆ లోటును తీర్చేసింది దురంధర్. ఇక 'ధురందర్ 2' వసూళ్ల పరంపర ఎక్కడ ముగుస్తుందో చూడటానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చాలా చర్చ జరుగుతోంది. రజనీకాంత్, అల్లు అర్జున్, రిషబ్ శెట్టి, శివరాజ్ కుమార్ వంటి ప్రముఖులు 'ధురందర్ 2' సినిమాను ప్రశంసించారు. దీంతో చిత్ర బృందానికి మరింత బలం చేకూరింది. అక్కడక్కడా నెగెటివ్ సన్నాయి నొక్కులు సోషల్ మీడియాలో వినిపిస్తున్నా.. ఎక్కువగా పాజిటివ్ కామెంట్స్ నే సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది దురంధర్ 2.