Nellore: హైటెక్ నిఘా.. హైస్పీడ్ గస్తీ తీరంలో ఇక అక్రమాలకు తావులేదు!
Nellore: నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె తీరంలో తమిళ జాలర్ల అక్రమ ప్రవేశాన్ని అరికట్టేందుకు హైస్పీడ్ బోటును కొనుగోలు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు.
Nellore: హైటెక్ నిఘా.. హైస్పీడ్ గస్తీ తీరంలో ఇక అక్రమాలకు తావులేదు!
Nellore: తమిళ జాలర్ల అక్రమ ప్రవేశాన్ని అరికట్టేందుకు నూతన హైస్పీడ్ బోటును వెంటనే కొనుగోలు చేయండి అంటూ మత్స్యశాఖ అధికారులకు కలెక్టర్ హిమాన్షు శుక్ల దిశానిర్దేశం చేశారు...తక్షణమే నిధులు మంజూరు చేసి – మరో బోటును అద్దెకు ఏర్పాటు చేయాలని సూచించారు.
నూతన బోటును మత్స్యకారులకే కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పరిధిలో మత్స్యకారుల భద్రత మరింత బలోపేతం చేయడానికి, తమిళ జాలర్లు ఆగడాలను అరికట్టేందుకు సముద్ర తీరంలో గస్తీని ముమ్మరం చేయాలని, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 450 హెచ్‌పి సామర్థ్యం గల హైస్పీడ్ బోటును తక్షణమే కొనుగోలు చేయాలని మత్స్యశాఖ అధికారులను దిశానిర్దేశం చేశారు. శనివారం ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో మత్స్యశాఖ అధికారులు, తీరప్రాంతంలోని 9 మండలాల తహశీల్దార్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మత్స్యకారుల భద్రతకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని తెలిపారు. ప్రస్తుతం రెండు బోట్లు సముద్రంలో గస్తీ నిర్వహిస్తున్నాయని, వీటిని హై స్పీడ్ బోట్స్ గా అప్ గ్రేడ్ చేస్తామన్నారు. వీటికి అదనంగా రూ.1.20 నుండి రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో 450 హెచ్‌పి హైస్పీడ్ గల మరొక బోటు కొనుగోలు చేయాలని, అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేస్తామని తెలిపారు.
బోటులో వీడియో రికార్డింగ్ సదుపాయం కలిగిన రెండు బైనాక్యూలర్లు, అధిక సామర్థ్యం గల తాడులు (రోప్స్), ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, రెండు ఫ్లాష్ లైట్లు, రెండు మెడికల్ కిట్లు వంటి అవసరమైన అన్ని భద్రతా పరికరాలను వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఖర్చు ఎంతైనా సరే అధునాతన సాంకేతికతతో కూడిన బోటును కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.
నూతనంగా కొనుగోలు చేసే బోటును మత్స్యకారులకే కేటాయించి, దాని నిర్వహణ, ఆపరేషన్లను వారే చూసుకునేలా చేయాలని సూచించారు. ఈ హైస్పీడ్ బోటు ద్వారా సముద్రంలో వేగవంతమైన గస్తీ నిర్వహించడంతో తమిళనాడు జాలర్ల అక్రమ ప్రవేశాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చని పేర్కొన్నారు. దూరం నుంచే వారి కదలికలను బైనాక్యూలర్ల ద్వారా గుర్తించి, వీడియో రికార్డింగ్ చేయడం కూడా సాధ్యమవుతుందని తెలిపారు.
ఈ బోటు మత్స్యకారుల భద్రతతో పాటు వారి జీవనోపాధికి కూడా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కొత్త హై స్పీడ్ బోట్ వచ్చేవరకు ఒక హై స్పీడ్ బోట్ ను అద్దెకు రెండు రోజులలోపు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమావేశంలో ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ డా. శాంతి, అసిస్టెంట్ డైరెక్టర్ చాంద్ బాషా, తీరప్రాంత మండలాల తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.