Yadadri Temple: యాదాద్రి వైభవం.. చూడడానికి రెండు కళ్ళు సరిపోవు.. కొత్తగా చేసిన నిర్మాణాలు ఇవే...

Yadadri Temple: యాదాద్రి కొండపైన భారీ స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేస్తున్నారు...

Update: 2022-03-28 09:16 GMT

Yadadri Temple: యాదాద్రి వైభవం.. చూడడానికి రెండు కళ్ళు సరిపోవు.. కొత్తగా చేసిన నిర్మాణాలు ఇవే...

Yadadri Temple: యాదాద్రి కొండపైన భారీ స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తిరుమల తిరుపతి తరహాలో ఈ ఆర్చీ ఉంటుంది. ఇక వైపు కొండ ఎక్కడానికి, మరో వైపు కొండ దిగేందుకు ఈ ఆర్చీని నిర్మాణం చేశారు. ఈ ఆర్చీ పైభాగంలో శంకు, చక్ర, నామాలు, శ్రీలక్ష్మీనరసింహస్వామి రూపాలను తీర్చిదిద్దారు. గర్భగుడిలో ఎదురుగా ఉండే స్వామి జ్వాలా నరసింహుడు. మరి కాస్త లోపల యోగముద్రలో యోగానందస్వామి, లక్ష్మీనరసింహ స్వాములను దర్శించుకోవచ్చు.

గర్భాలయం నుంచి బయటకు వస్తే మెట్లకు ఎడమపక్కన క్షేత్రపాలకుడైన హనుమంతుడి గుడి ఉంది. హనుమంతుడి విగ్రహానికి కింద గల పెద్ద రాతిచీలికలో గండభేరుండ నరసింహుని స్వయంభువు రూపం కనిపిస్తుంది. ఆంజనేయస్వామిని దర్శించుకున్నాక బయట ఎడమవైపున మెట్లు దిగితే పుష్కరిణి. కుడివైపు కొన్ని మెట్లు దిగితే పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరుని ఆలయం అగుపిస్తాయి.


గర్భాలయంపైన దివ్య విమాన గోపురానికి భక్తులు విరాళంగా ఇచ్చిన 125 కిలోల బంగారంతో తాపడం చేయిస్తున్నారు. పంచనారసింహులు కొలువైన గర్భాలయ ద్వారాలకు బంగారు తాపడం చేసిన కవచాలను బిగించారు. ఆళ్వార్‌ మండపంలో 35 అడుగుల ఎత్తులో ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఈ ధ్వజస్తంభానికి సైతం బంగారు తొడుగులను ఇటీవలనే పూర్తి చేశారు. త్రితల, పంచతల, సప్తతల రాజగోపురాలకు పసిడి కలశాలు బిగించారు. వీటితోపాటు ఉప ఆలయాల ద్వారాలకు వెండి, ప్రథమ, ద్వితీయ ప్రాకారాల్లో ద్వారాలకు ఇత్తడి తొడుగులు, అష్టభుజి ప్రాకార మండప శిఖరాలపై రాగి కలశాలు బిగించారు.


సాధారణంగా ఏ ఆలయంలోనైనా ఒక తరహా వాస్తు నిర్మాణాలూ శిల్ప కళా కన్పిస్తాయి. ఇక్కడ మాత్రం విభిన్న రీతుల్లో రూపుదిద్దుకున్న నిర్మాణాలు భక్తుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. 34 అడుగుల ఎత్తున రెండంతస్తులుగా ఉన్న ఈ మండపంలో పై అంతస్తులో కాకతీయ శైలి స్తంభాలూ, కింది అంతస్తులో 12 మంది ఆళ్వారుల విగ్రహాలూ ఉంటాయి. తమ పాశురాలతో వైష్ణవ సంప్రదాయాన్ని దక్షిణాదిన వ్యాపింపజేసిన 12 మంది ఆళ్వారుల విగ్రహాలు అటు ఆరు, ఇటు ఆరు చొప్పున నిటారుగా నిలబడి కనిపిస్తాయి. ఆళ్వారుల విగ్రహాలను విడివిడిగా కూర్చున్న రూపంలో వేర్వేరు దేవాలయాల్లో చూడొచ్చు కానీ ఇలా ఒకేచోట అందరినీ చూడడం మరెక్కడా సాధ్యం కాదు.


యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైనే ఉన్న అనుబంధ ఆలయంగా శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి దేవాలయం కొనసాగుతోంది. శివాలయంలో ప్రధాన ఆలయం, ముఖ మండపం, ప్రకార మండపం, త్రితల రాజగోపురం నిర్మించారు. ప్రధాన ఆలయంలోని మండపాల్లో, నాలుగు దిశల్లో కృష్ణ శిలతో స్టోన్‌ ఫ్లోరింగ్‌ పనులు చేశారు. ప్రధాన ఆలయం ముందు భారీ నందీశ్వరుడి విగ్రహాన్ని పెట్టారు. ఆలయానికి ఉత్తర దిశలో శ్రీస్వామి వారి కల్యాణ మండపం, ఆ పక్కనే రథశాల నిర్మించారు.


ఈ క్షేత్రంలోని స్వామివారి పుష్కరిణికి ఓ ప్రత్యేకత ఉంది. దీనినే 'విష్ణుకుండం' అని పిలుస్తుంటారు. యాదగిరి నరసింహస్వామి పాదాల వద్ద నుంచి నిరంతరం పెల్లుబుకుతూ వచ్చే నీరు ఈ పుష్కరిణిలో చేరుతుంటుంది. ఈ తీర్థం చాలా మహిమాన్వితమైనదని పేరు. భక్తుల రాక యేటేటా పెరగడంతో ఈ క్షేత్రం తెలంగాణ తిరుపతిగా వాసికెక్కింది. ప్రస్తుతం ఈ క్షేత్ర యాజమాన్యం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంది. యాదగిరి లక్ష్మీనరసింహ క్షేత్రం జనాకర్షకమై భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతోంది.


శ్రీస్వామి వారికి భక్తులు సమర్పించుకునే తలనీలాల కోసం అధునాతన హంగులతో కల్యాణ కట్టను నిర్మించారు. దీనిని 2.23 ఎకరాల విస్తీర్ణంలో 20.3 కోట్ల వ్యయంతో నిర్మాణం చేశారు. ఇందులో ఒకేసారి 360 మంది పురుషులు, 160 మంది మహిళ భక్తులు తలనీలాలు సమర్పించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీస్వామి క్షేత్రంలో మండల దీక్ష చేసే భక్తులకు దీక్షాపరుల మండపాన్ని అధునాతనంగా నిర్మించారు. యాదాద్రి కొండకు దిగువన 93 ఎకరాల్లో యాగ స్థలాన్ని ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News