Low Majority: తక్కువ ఓట్లతో గట్టెక్కిన నేతలు

Low Majority: ఎంఐఎం నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు 50వేల ఓట్ల మెజార్టీతో గెలుపు

Update: 2023-12-04 13:02 GMT

Low Majority: తక్కువ ఓట్లతో గట్టెక్కిన నేతలు 

Low Majority: తెలంగాణలో ఎన్నికల పర్వం ముగిసింది. హోరా హోరీ ఫైట్‌లో చివరికి హస్తానిదే పైచేయి అయింది. 64సీట్లతో మ్యాజిక్ ఫిగర్‌ అందుకుని అధికారం కైవసం చేసుకుంది కాంగ్రెస్. త్రిముఖ పోరులా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు అతి తక్కువ మెజారిటీతో గట్టెక్కితే, మరి కొందరు రికార్డు స్థాయిలో ఓట్లు సాధించి గెలుపు పతాకం ఎగుర వేశారు. ఇంతకు బొటాబొటీ ఓట్లతో గట్టెక్కింది ఎవరో.. భారీ మెజార్టీతో గెలిచిన నేతలు ఎవరో ఓసారి చూద్దాం.

ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే. ఒక్క ఓటే అభ్యర్థుల జాతకాలను నిర్ణయిస్తుంది. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో కేవలం వందల ఓట్ల తేడాతోనే ఓటమి అంచున నుంచి బయటపడ్డారు చేవెళ్ల అభ్యర్థి కాలె యాదయ్య. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కాలె యాదయ్య.. కేవలం 268 ఓట్ల అతి తక్కువ మెజార్టీతో గట్టెక్కారు. కాంగ్రెస్ అభ్యర్థి భీం భరత్‌పై ఆయన గెలుపొందారు. యాకుత్‌పురలో ఎంఐఎం అభ‌్యర్థి జాఫర్‌ హుస్సేన్‌ 878 ఓట్లతో గెలుపొందారు. జుక్కల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీకాంతరావు 1,152ఓట్ల తేడాతో విజయం సాధించారు. దేవరకద్రలో కాంగ్రెస్ అభ్యర్థి..గవినోళ్ల మధుసూదన్‌రెడ్డి 1,392 ఓట్లతో గెలుపొందారు. నాంపల్లిలో ఎంఐఎం అభ్యర్థి మాజిద్‌ హుస్సేన్‌ 2,037ఓట్లతో గెలిచారు.

ఇక తెలంగాణ ఎన్నికల్లో 20 మంది 50వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కుత్బుల్లాపూర్‌ నుంచి కేపీ వివేకానంద్ ఈసారి అత్యధిక ఓట్లతో గెలిచిన అభ్యర్థిగా నిలిచారు. బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన వివేకానంద్ 85వేల 576 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అలాగే గత రెండు టర్మ్‌లు రికార్డు స్థాయి ఓట్లతో గెలిచినా హరీష్ రావు ఈసారి సిద్దిపేట బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా 82,308 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2018లో లక్షా 18వేల ఓట్లతో గెలిచిన హరీష్ రావు మెజార్టీ ఈసారి కాస్త తగ్గింది.

ఇక చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్‌ ఒవైసీ 81,660 ఓట్ల తేడాతో గెలిచారు. కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా 70వేల 387ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగరేశారు. నకిరేకల్‌ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం 68వేల ,839 ఓట్ల మెజార్టీతో చిరుమర్తి లింగయ్యపై విజయం సాధించారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డిపై ఆయన సుమారు 54 వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. 50 వేలపైన మెజార్టీ సాధించినవారిలో కాంగ్రెస్‌ నుంచి 13 మంది, బీఆర్‌ఎస్‌ నుంచి నలుగురు, ఎంఐఎం నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు ఉన్నారు.

Tags:    

Similar News