TS Mandali Chairman: ఛాన్స్ ఎవరికి ?
Telangana Legislative Council Chairman: తెలంగాణ శాసన మండలి సమావేశాలు ఈ దఫా ప్రొటెం చైర్మన్‌తో నడిపిస్తారా ?
TS Mandali Chairman: ఛాన్స్ ఎవరికి ?
Telangana Legislative Council Chairman: తెలంగాణ శాసన మండలి సమావేశాలు ఈ దఫా ప్రొటెం చైర్మన్‌తో నడిపిస్తారా ? లేక కొత్త చైర్మన్‌ను నియమిస్తారా ? మిగిలిన విప్ పదవులు భర్తీ చేస్తారా ? సమావేశాలకు ముందే ఆశావహులకు కేసీఆర్ గుడ్ న్యూస్ చెబుతారా ? లేక పెండింగ్‌లోనే పెడతారా అంటూ గులాబీ పార్టీలో హాట్ హాట్‌గా జరుగుతున్న చర్చపై హెచ్ఎం టీవీ స్పెషల్ డ్రైవ్ .
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి. అందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి అటు బడ్జెట్‌తో పాటు ఇటు కౌన్సిల్‌ను చైర్మన్ స్థానం నుంచి ఎవరు నడిపిస్తారనే ఆసక్తి రేగింది. గత సమావేశాలను ప్రొటెం చైర్మన్‌గా సమావేశాలను నిర్వహించారు. ఆ తర్వాత ఆయన పదవీ కాలం ముగియడంతో ఎంఐఎంకు చెందిన సీనియర్ సభ్యులు అమీణుల్ హసన్ జాఫ్రీని ప్రొటెం చైర్మన్‌గా నియమించారు. ప్రస్తుతం ఆయనే కౌన్సిల్ కు ఎన్నికైన సభ్యుల చేత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక త్వరలో ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలను సైతం ఆయనే నడిపిస్తారా ? లేక కొత్త చైర్మన్ ఎంపిక ఉంటుందా అన్నది హాట్ టాపిక్‌గా మారింది.
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కౌన్సిల్‌కు చైర్మన్‌ను నియమించడంపై కేసీఆర్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే గతంలో చైర్మన్‌గా చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్నారు. కానీ ముందస్తుకు వెళ్లే ఆలోచనలో ఉన్న కేసీఆర్ మంత్రివర్గ పునర్వ్యవస్తీకరణ చేసే అవకాశాలు కనిపించడం లేదు. దాంతో గుత్తా మరోమారు చైర్మన్ పదవి దక్కితే చాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే సామాజిక సమీకరణ నేపథ్యంలో కౌన్సిల్ చైర్మన్ పీఠానికి మాజీ అసెంబ్లీ స్పీకర్ మధుసూధనా చారి, కడియం శ్రీహరి పేర్లు కూడా కేసీఆర్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇక అదలా ఉంటే నేతి విద్యాసాగర్ పదవీ కాలం ముగిసిన తర్వాత డిప్యూటీ చైర్మన్ పోస్ట్ ఖాళీగా ఉంది. ఇప్పుడా పదవిని బండ ప్రకాష్ లేదా పీవీ కుమార్తె సురభి వాణిదేవికి ఇచ్చే ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్లు టాక్.
ఇక చీఫ్ విప్‌గా పని చేసిన బోడకుంటి వెంకటేశ్వర్లు, విప్‌లు భాను ప్రసాద్, పల్లా రాజేశ్వర్ రెడ్డిల పదవీ కాలం ముగియడంతో కాన్సిల్‌లో ఆ పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. మొత్తానికి కౌన్సిల్‌లో ఈ పదవులన్నీ బడ్జెట్ సమావేశాలకు ముందే భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.