భద్రాద్రి జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు

Bhadradri Kothagudem: వైరల్ ఫీవర్లతో బాధపడుతున్న ఏజెన్సీ వాసులు

Update: 2022-08-01 06:53 GMT

భద్రాద్రి జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను విషజ్వరాలు వణికిస్తున్నాయి. మణుగూరు మండలంలోని మన్యం ప్రజలు మంచం పట్టారు. వైరల్ ఫీవర్‌లు, సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరుతున్న జ్వర బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రుల్లో విపరీతంగా దోపిడీ చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని మన్యం ప్రజలు మంచం ఎక్కారు. విష జ్వరాలు, వైరల్ ఫీవర్‌లు, సీజనల్ వ్యాధులకు గురై ప్రభుత్వ, ప్రైవేటు వైద్యం కోసం క్యూ కడుతున్నారు. ప్రతి గ్రామంలో సుమారు 20 నుండి 30 మంది వరకు ఏజెన్సీ ప్రజలు జ్వరాల బారిన పడ్డారు. చిన్నపిల్లలు నుంచి మొదలై వృద్ధుల వరకు ఈ ప్రభావం అధికంగా ఉంది. ఏ ప్రైవేటు ఆసుపత్రిని చూసినా జలుబు, దగ్గుతో కూడిన విష జ్వరాల పీడుతులే దర్శనమిస్తున్నారు. 

ఏజెన్సీ మండలాలైన కరకగూడెం, ఆళ్లపల్లి, గుండాల, పినపాక మండలాల్లో విష జ్వరాల ప్రభావం అధికంగా ఉంది. గిరిజన గ్రామాల్లో సరైన సర్కారీ వైద్యం అందని ప్రజలు మణుగూరు పట్టణానికి పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ వైద్యశాలలో పూర్తిస్థాయి సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఏజెన్సీ వాసులు వాపోతున్నారు. దీనికి తోడు ఇటీవలే గోదావరి నది ఉగ్రరూపంతో సంభవించిన వరదలతో అతలాకుతలమైన ప్రజలు అంటువ్యాధుల ముంపున పడుతున్నారు. 

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సదుపాయాలు లేక ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తుంటే అక్కడ వ్యాధికో రేటు అన్న చందంగా వ్యవహరిస్తూ నిలువునా దోపిడీ చేస్తున్నారని ఏజెన్సీ వాసులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ఏజెన్సీ ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చాలని ప్రజలు వేడుకుంటున్నారు. గ్రామాల్లో మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని ఏజెన్సీ ప్రాంత వాసులు కోరుతున్నారు.

Tags:    

Similar News