మందు బాబులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో ఆ బీర్ల సరఫరా పునరుద్దరణ
UBL to supply kingfisher beers in Telangana: మందు బాబులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో ఆ బీర్లు పునరుద్దరణ
Beer Price Hike: మందు బాబులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన మద్యం ధరలు
Kingfisher beers supply in Telangana: తెలంగాణ రాష్ట్రంలో బీర్ల సరఫరా పునరుద్దరణ చేస్తున్నట్టు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ వెల్లడించింది. ఈ నెల 8వ తేదీన నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటన చేసిన యూబీఎల్ బీర్ల సరఫరా పునరుద్దరిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. బీర్ల ధరల పెంపు, పాత బకాయిల చెల్లింపులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం హమీ ఇవ్వడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూబీఎల్ వివరించింది. కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాను పునరుద్దరిస్తున్నట్టు వెల్లడించింది.
కింగ్‌ఫిషర్‌తో పాటు ఏడు బ్రాండ్లకు చెందిన బీర్ల సరఫరా ఆగిపోయింది. దీంతో కొరత ఏర్పడుతుందని భావించిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంది. అదే విధంగా యూబీఎల్ ఒత్తిళ్లకు ప్రభుత్వం తలొగ్గదని కూడా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వం, ఇటు యూబీఎల్ యాజమాన్యం మధ్య జరిగిన చర్చల్లో పురోగతి కనిపించింది. అంతేకాకుండా త్వరలోనే బకాయిల చెల్లింపులతో పాటు ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని యూబీఎల్ వెల్లడించింది.
ఇరు పక్షాల మధ్య అంతర్గత ఒప్పందం మేరకు తాము బీర్ల సరఫరాను పునరుద్దరిస్తున్నట్టు యూబీఎల్ చెప్పుకొచ్చింది. వినియోగదారులు, కార్మికులు, వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. బీర్ ధరలో 70 శాతం పన్నులే ఉన్నాయని యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ కంపెనీ అంటోంది. ప్రభుత్వం తమకు దాదాపు రూ.702 కోట్ల బకాయిలు చెల్లించాల్సి.. ఉందని బీర్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కంపెనీ కోరితే స్పందించడంలేదని కంపెనీ ఆరోపించింది. ఈ ధరలతో గిట్టుబాటు కావడంలేదని, ఫలితంగా భారీగా నష్టాలు వస్తున్నాయని తాము ఉత్పత్తిని ఆపేస్తామని కంపెనీ ప్రకటించింది. చెప్పినట్లుగానే ఆ తర్వాత బీర్ల సరఫరా ఆపేసింది.
ఇటీవల పండుగ సీజన్‌లో పెద్ద ఎత్తున బీర్ల అమ్మకాలు జరిగాయి. అలాగే వేసవి కాలంలో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు జరుగుతాయి. అందుకే కంపెనీ కూడా మార్కెట్ కోల్పోతే మళ్లీ సాధించుకోవడం కష్టమని ఆలోచించి వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది.
మరోవైపు బీర్ల సరఫరా నిలిపివేయడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది. దీంతో మద్యం ధరల పెంపు అంశంపై హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫారసుల మేరకు నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో యూబీఎల్ సరఫరాను పునరుద్దరించింది.