Yadadri Bhuvanagiri: విషాదం.. హాస్టల్‌ గదిలో ఉరేసుకున్న స్నేహితులు

Yadadri Bhuvanagiri: తమను వేధిస్తున్నారంటూ వారిపై ఫిర్యాదు చేసిన 7వ తరగతి విద్యార్థినులు

Update: 2024-02-04 04:34 GMT

Yadadri Bhuvanagiri: విషాదం.. హాస్టల్‌ గదిలో ఉరేసుకున్న స్నేహితులు 

Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. టెన్త్ విద్యార్థినులు భవ్య, వైష్ణవి భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్ లో ఉంటూ భువనగిరి పట్టణంలోని బీచ్ మహల్లా ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. స్నేహితులైన వీరిద్దరూ తమను వేధింపులకు గురి చేశారంటూ అదే హాస్టల్ లో ఉంటున్న 7వ తరగతి విద్యార్థినులు నలుగురు.. పాఠశాల పీఈటీకి ఫిర్యాదు చేశారు. ఆమె హాస్టల్ వార్డెన్ శైలజకు సమాచారం ఇచ్చారు. ఆమె భవ్య, వైష్ణవిలను మందలించడంతో పాటు హాస్టల్ లో జూనియర్, సీనియర్ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అటు భవ్య, వైష్ణవిల తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు. విషయం బయటకి తెలియడంతో భయాందోళనలకు గురయ్యారు. శనివారం సాయంత్రం వీరి గదిలో ఉండే ఇతర విద్యార్థినులు ట్యూషన్ కి వెళ్లగా.. భవ్య, వైష్ణవి మాత్రం తర్వాత వస్తామని చెప్పి గదిలోనే ఉండిపోయారు. అయితే వారిని తీసుకురావాలని ట్యూషన్ టీచర్ తోటి విద్యార్థినులను గదికి పంపించారు.

అయితే గదికి వెళ్లిన విద్యార్థినులు.. తలుపు తెరుచుకోకపోవడంతో కిటికీ నుంచి చూడగా భవ్య, వైష్ణవి ఫ్యాన్ కు పాఠశాల యూనిఫాం చున్నీలతో ఉరి వేసుకుని కనిపించారు. వారు వెంటనే ట్యూషన్ టీచర్ కు విషయం చెప్పారు. వార్డెన్, ఇతర సిబ్బంది తలుపు బలవంతంగా తీసి ఇద్దర్నీ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మరణించారని వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం మార్చురీకి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పోలీసులు తెలిపారు.

ఇక విద్యార్థినులు సూసైడ్ చేసుకున్న రూమ్ లో సూసైడ్ నోట్ లభించింది. తాము వెళ్లిపోతున్నందుకు అందరూ తమను క్షమించాలని.. తాము చేయని తప్పుకు అందరూ తమను అంటుంటే ఆ మాటలు పడలేక పోతున్నామన్నారు. శైలజ మేడం తప్ప ఎవ్వరూ తమను నమ్మలేదంటూ సూసైడ్ నోట్ లో తెలిపారు. తమ బాధ ఎవరికీ చెప్పుకోలేక వెళ్లిపోతున్నామని.. ఇద్దరినీ ఒకేచోట సమాధి చేయాలని కోరారు. ఇదే తమ ఆఖరి కోరిక అంటూ భవ్య, వైష్ణవి నోట్ రాశారు.

Tags:    

Similar News