TS High Court: మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టు షాక్..!

TS High Court: శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదనే పిటిషన్ విచారణకు నిర్ణయం

Update: 2023-07-26 01:38 GMT

TS High Court: మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టు షాక్..! 

TS High Court: తెలంగాణ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. త‌న ఎన్నిక చెల్లదంటూ దాఖ‌లైన పిటిష‌న్‌ను కొట్టి వేయాలంటూ ఆయ‌న న్యాయ‌స్థానాన్ని ఆశ్రయించారు. ఆయ‌న ఎన్నిక చెల్లదనే పిటిష‌న్‌ను విచారించేందుకే హైకోర్టు నిర్ణయించింది. అఫిడ‌విట్‌లో త‌ప్పుడు వివ‌రాలు స‌మ‌ర్పించార‌నే కేసులో కొత్తగూడెం ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వరరావు ఎన్నిక చెల్లదనే తీర్పు వ‌చ్చిన స‌మ‌యంలోనే, మంత్రికి కూడా న్యాయ‌స్థానంలో ప్రతికూల నిర్ణయం వెలువడటంతో చర్చనీయాంశమైంది.

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి వ‌రుస‌గా రెండోసారి టీఆర్ఎస్ త‌ర‌పున‌ శ్రీ‌నివాస్‌గౌడ్ గెలుపొందారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడుగా శ్రీ‌నివాస్ గౌడ్ మెలుగుతున్నారు. దీంతో ఆయ‌న మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. శ్రీ‌నివాస్ గౌడ్ ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో త‌ప్పుడు ద్రువ ప‌త్రాలు స‌మ‌ర్పించార‌నే కార‌ణంతో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కు చెందిన ఓట‌రు రాఘ‌వేంద్ర రాజు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

శ్రీ‌నివాస్‌కు ఎమ్మెల్యేగా, మంత్రిగా కొన‌సాగే అర్హత లేద‌ని ఆ పిటిష‌న్‌లో రాఘ‌వేంద్ర పేర్కొన్నారు. అయితే ఆ పిటిష‌న్‌కు విచార‌ణ అర్హత లేద‌ని, కావున కొట్టి వేయాల‌ని కోరుతూ శ్రీ‌నివాస్ గౌడ్ న్యాయ‌స్థానాన్ని కోరారు. ఇరువైపు వాద‌న‌ల‌ను విన్న న్యాయ‌స్థానం... రాఘ‌వేంద్ర పిటిషన్ విచారణకు స్వీకరించింది. మంత్రి శ్రీనివాస్ వాద‌న‌ను హైకోర్టు తోసిపుచ్చింది. రాఘ‌వేంద్ర రాజు పిటిష‌న్‌ను విచారించేందుకు హైకోర్టు అనుమ‌తి ఇవ్వడం విశేషం. దీంతో మంత్రికి హైకోర్టు షాక్ ఇచ్చిన‌ట్టైంది. వ‌న‌మా వెంక‌టేశ్వర రావు అనర్హత వేటు వేసిన సంద‌ర్భంలోనే అధికార పార్టీకి చెందిన మ‌రో నాయ‌కుడిపై పిటిష‌న్‌కు సంబంధించి ప్రతికూల తీర్పు రావ‌డం చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News