టాలీవుడ్ కెమెరామేన్ సూసైడ్... భార్య శ్వేతా రెడ్డి టార్చర్ వల్లేనని తల్లి ఫిర్యాదు
టాలీవుడ్ కెమెరామేన్ సూసైడ్... భార్య శ్వేతా రెడ్డి టార్చర్ వల్లేనని తల్లి ఫిర్యాదు
Crime News : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని క్రిష్ణానగర్‌లో తెలుగు సినీ పరిశ్రమలో కెమెరామేన్‌గా పనిచేస్తోన్న మొహమ్మద్ నవాజ్ సూసైడ్ చేసుకున్నారు. అయితే, "తన కొడుకు నవాజ్ ఆత్మహత్యకు కోడలు శ్వేతా రెడ్డి వేధింపులే కారణం" అని సాబెరా బేగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్వేత మనుషులను పెట్టించి మరీ తన కొడుకు నవాజ్ ను కొట్టించారని సాబెరా బేగం పోలీసులకు చెప్పారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా కథనం ప్రకారం.. నవాజ్‌ను ఆస్తి కోసం, డబ్బుల కోసం శారీరకంగా హింసించడం, మానసికంగా వేధించడం జరిగేదని సాబెరా పోలీసులకు తెలిపారు. కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి తిండి పెట్టకుండా వేధించడం, ఏమైనా అంటే పోలీసు కేసు పెడతానని బెదించడం జరిగిందన్నారు.
2020 లో నవాజ్ మొహమ్మద్, శ్వేత రెడ్డి పెళ్లి చేసుకున్నారు. క్రిష్ణానగర్‌లో కాపురం పెట్టారు. కానీ వారి కాపురం మొత్తం ఆమె వేధింపులు, వివాదాలు, పోలీసు కేసులతోనే కొనసాగిందని సాబెరా బేగం తెలిపారు.
ఒకానొక దశలో భార్య పెట్టే టార్చర్ తట్టుకోలేక తన కొడుకు బాన్సువాడలో ఉన్న తన దగ్గరికి వచ్చేశాడన్నారు. బాన్సువాడలో పోలీసుల కౌన్సిలింగ్ తరువాత మళ్లీ ఇద్దరూ కలిసి క్రిష్ణానగర్ చేరుకున్నారు.
ఆదివారం తనకు ఫోన్ చేసిన నవాజ్... భార్య పెట్టే వేధింపులు భరించలేకపోతున్నానని చెప్పినట్లు సాబెరా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ఇక బతకాలని లేదని చెప్పిన నవాజ్ కు ధైర్యం చెప్పానని, కానీ ఆ మరునాడే ఆత్మహత్య చేసుకున్నారని ఆమె పోలీసుల ఎదుట వాపోయారు. నవాజ్ తల్లి సాబెరా ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు మొదలుపెట్టారు.