BJP: టీ బీజేపీలో విచిత్ర పరిస్థితి.. రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై కొనసాగుతున్న గందరగోళం

BJP: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికే రాష్ట్ర పగ్గాలు అంటూ లీకులు

Update: 2023-07-03 15:00 GMT

BJP: టీ బీజేపీలో విచిత్ర పరిస్థితి.. రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై కొనసాగుతున్న గందరగోళం

BJP: తెలంగాణ బీజేపీలో విచిత్ర పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో బీజేపీ చీఫ్ మార్పు జరగబోతోందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు అప్పజెప్పి.. బండిని కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. దీనిపై ఎలాంటి క్లారిటీ రాకముందే... తానే రాష్ట్ర అధ్యక్షుడు కాబోతున్నట్టు ఈటల రాజేందర్ వ్యవహారశైలి కనిపిస్తోంది. బీజేపీ పార్టీలోకి వచ్చిన వలస నాయకులు అందరూ ఈటల నాయకత్వాన్ని కోరుకున్నట్టు..ఈటలని నియమిస్తే పార్టీలోకి వలసలు పెరుగుతాయనేలా వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే సగటు బీజేపీ కార్యకర్త మాత్రం బండిని కొనసాగించకపోతే ఇన్ని రోజులు చేసిన కృషి వేస్ట్ అవుతుందనే భావనలో విశ్లేషిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీని కాదని బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో రాష్ట్రంలో బీజేపీ ప్రాభావం గురించి డిస్కషన్ ప్రారంభమైంది. ఆ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని పార్టీలోకి తీసుకురావడానికి ఈటల ప్రయత్నం ఫలితాన్నిచ్చింది. రాష్ట్రంలో చేరికల కమిటీ ఛైర్మన్ గా తనవంతుగా ఇతర పార్టీల్లోని అసంతృప్తులను, అవకాశం దక్కదనే అనుమానం ఉన్నవాళ్లను పార్టీలోకి తీసుకువచ్చేందుకు ఈటల ప్రయత్నించారు. ఈ తతంగాన్ని చూసిన కొద్ది మంది ఈటల ద్వారా పార్టీలోకి వచ్చే వారి సంఖ్య చాలానే ఉంటుందని భావించారు. కానీ రాజగోపాల్ రెడ్డి ఓటమి తర్వాత పార్టీలోకి వలసలు పూర్తిగా తగ్గిపోయాయి. బీజేపీ వైపు చూస్తున్నారన్న వార్తలు వినిపించిన పొంగులేటి...జూపల్లిని పార్టీలోకి తీసుకురావడంలో ఈటల ఫెయిలయ్యారనే భావన జాతీయ నాయకులకు కలిగింది. దీనికి తోడు పొంగులేటి, జూపల్లి చేసిన వ్యాఖ్యలను బాహాటంగా చెప్పడంతో బీజేపీ కన్నా కాంగ్రెస్సె బెటర్ అనే భావనను బీజేపీ వైపు రావాలని భావిస్తున్న నాయకులను సైతం ఆలోచనలో పడేసింది. వీటన్నింటినీ ఉదాహరణగా చెబుతున్న బీజేపీలోని కొద్దిమంది ఈటలను రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తే పార్టీకి పెద్దగా లాభం లేదని చెబుతున్నారు.

మరోవైపు కిషన్ రెడ్డి...సుదీర్ఘంగా బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు. సౌమ్యుడిగా.. వివాదరహితుడిగా కిషన్ రెడ్డికి పేరు ఉంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల వ్యవహారశైలిని చూస్తే కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా సక్సెస్ అవ్వడం కష్టం అనే భావన రాష్ట్ర ప్రజల్లోనే ఉంది. కేసీఆర్, రేవంత్ రెడ్డిలకు వారి స్థాయిలోనే సమాధానం చెప్పాలంటే కిషన్ రెడ్డి స్వరం సరిపోదని అంటున్నారు. అజాత శత్రువుగా పేరున్న కిషన్ రెడ్డిపై కేసీఆర్ తో సత్సంబంధాలు కూడా నెగెటివ్ ఇంప్రెషన్‌నే ఇస్తున్నాయి. ఢీ కొట్టాల్సిన సమయంలో కూడా ఢీలాగా మాట్లాడటం తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఇంప్రెస్ చేయలేవనేది విశ్లేషకుల వాదన. ఇలాంటి పరిస్థితుల్లో కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా కంటే కేంద్రమంత్రిగా ఉండటమే బెటర్ అంటున్నారు.

బండి సంజయ్ 2018 ఎన్నికలకు ముందు ఓ సాధారణ కార్యకర్తగా కొద్దిమంది బీజేపీలోని కొద్దిమందికి మాత్రమే తెలుసు. కరీంనగర్ ఎంపీగా ఎన్నికయిన తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయిన బండి ఎంపీగా గెలవడాన్ని గొప్పగా భావించారు. కరీంనగర్ లో తను సాధించిన ఫలితాలను చూసిన తన కమిట్ మెంట్ ని గమనించిన కేంద్రపార్టీ తనకు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పజెప్పారు. పదవిని చేపట్టిన బండి వెంటనే కార్యాచరణ మొదలు పెట్టేశారు. ఓ వైపు పార్టీని బలోపేతం చేస్తూనే తనకన్నా సీనియర్లందరినీ ఏకతాటిపైకి తెచ్చారు. వేరే పార్టీలనుంచి నాయకులను ఆకర్షిస్తూనే ఉన్న నాయకుల మధ్య భేదాభిప్రాయాలు రాకుండా జాగ్రత పడ్డారు. దీంతో రాష్ట్రంలోని అన్ని పరిణామాలు అన్నీ బండికి అనుకూలంగా మారాయి.

బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన తర్వాత రఘునందనరావు.. ఈటల ఎమ్మెల్యేలుగా గెలిచారు. గెలుపుకి కారణం ఎవరైనా.. ఆసమయంలో బండి వ్యవహరించిన తీరు.. కేసీఆర్‌ని, రేవంత్ రెడ్డిని ఎదుర్కొన్న పద్ధతి బండి ఇమేజ్‌ని అమాంతం పెంచేసింది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మాత్రం బండి సంజయ్ పడిన కష్టమనే భావన మిగిలిన పార్టీ నాయకులు కూడా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీకి ఉన్న సానుకూలతను రాష్ట్రంలో ప్రతిబింభించేలా చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం అంటే బీజేపీనే అనేలా వ్యవహరించారు. దీంతో రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందనే భావన.. బీఆర్ఎస్‌కు ఆల్టర్నేటివ్ బీజేపీనే అనే భావనను ప్రజలందరికీ వచ్చేలా చేశారు. అయితే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడి మార్పు అనే పుకార్లతో బీజేపీ పరిస్థితి మళ్లీ పాత పరిస్థితికే వస్తుందేమో అనే భావన కార్యకర్తల్లో ఏర్పడుతోంది. ఎన్నో కష్టాలుపడిన బండి సంజయ్‌కే ఇలాంటి పరిస్థితి ఉంటే మా పరిస్థితి ఏంటి అనే భావన కార్యకర్తల్లో ఏర్పడుతోందని అనుకుంటున్నారు. చిన్న కార్యకర్తనుంచి అధ్యక్ష స్థాయికి ఎదిగిన ఎంతో మంది ఉన్న పార్టీలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఏంటనే భయం సాధారణ కార్యకర్తల్లో పెరిగిపోతోంది.

బీజేపీ రాష్ట్ర అధినాయకత్వం విషయంలో పార్టీ స్పష్టతను ఇవ్వకపోతే ఈ గందరగోళం కొనసాగుతూనే ఉంటుంది. అధ్యక్ష పదవినుంచి..సీఎం అభ్యర్థిత్వం వరకు ఎవరికి వారే క్లెయిమ్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పుకార్లకు వీలైనంత త్వరగా ఫుల్ స్టాప్ పెట్టకపోతే బీజేపీకి అపార నష్టం జరిగే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

Tags:    

Similar News