KTR: హైదరాబాద్ ప్రజలకు పాదాభివందనం చేసినా తక్కువే
KTR: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కూల్చివేతలు, పేల్చివేతలకు మాత్రమే పరిమితమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
KTR: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కూల్చివేతలు, పేల్చివేతలకు మాత్రమే పరిమితమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
పేమెంట్ కోటా సీఎం.. హామీల ఎగవేత!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యక్తిగత మరియు రాజకీయ విమర్శలు సంధించారు. రేవంత్ రెడ్డి తన 'కిస్మత్' బాగుండి, పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చలేదని, గ్యారంటీల అమలులో కాంగ్రెస్ 'ఎగవేత' ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు. పెంచుతామన్న పింఛన్లు ఎప్పటి నుండి ఇస్తారో సీఎం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
మేడిగడ్డ ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలే కూల్చివేశారని ఆరోపించిన కేటీఆర్.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన చెక్‌డ్యామ్‌లను కూడా పేల్చివేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి బూతులతో సమాధానం ఇస్తున్నారని, తమకు కూడా తిట్ల భాష వచ్చు కానీ సంస్కారం అడ్డువస్తోందని పేర్కొన్నారు.
హైదరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు బీఆర్‌ఎస్‌ను ఆదరించిన హైదరాబాద్ ప్రజలకు కేటీఆర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. "నగర ప్రజలకు ఎన్నిసార్లు పాదాభివందనం చేసినా తక్కువే" అని వ్యాఖ్యానించారు. అలాగే కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి తట్టుకోలేరని, ఆయన రాక కోసం అంతా ఎదురుచూస్తున్నారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.