Bandi Sanjay: బిడ్డా.. కుట్రలు చేస్తే రోడ్లపై ఉరికిస్తాం! కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తుపై బండి సంజయ్ వార్నింగ్

Bandi Sanjay: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.

Update: 2026-02-14 08:54 GMT

Bandi Sanjay: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు అపవిత్ర పొత్తులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. కరీంనగర్‌లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించినప్పటికీ, కుట్రలు చేసి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

అక్రమ సంబంధాల 'వాలంటైన్స్ డే' శుభాకాంక్షలు!

ఈ మూడు పార్టీల తీరుపై బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు వాలంటైన్స్ డే శుభాకాంక్షలు. కాంగ్రెస్‌తో సంసారం చేస్తూ బీఆర్ఎస్‌కు కన్నుకొట్టే పార్టీ ఎంఐఎం. ఈ రెండు పార్టీల అక్రమ సంబంధానికి ఎంఐఎం అనుసంధానకర్తగా వ్యవహరిస్తోంది" అని మండిపడ్డారు. ఈ ముగ్గురూ కలిసినా 26 సీట్లు దాటలేదని, మరి ఏ మొహం పెట్టుకుని మేయర్ పదవి అడుగుతున్నారని ప్రశ్నించారు.

ప్రజా తీర్పుకు విరుద్ధంగా వెళ్తే ఖబడ్డార్!

ఇండిపెండెంట్లు బీజేపీలో చేరడంతో తమకు మ్యాజిక్ ఫిగర్ దాటిందని, అయినా అడ్డదారిలో మేయర్ పదవి కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు."ప్రజా తీర్పుకు భిన్నంగా కుట్రలు చేస్తే కరీంనగర్ నుంచే మీ అంతు చూస్తా. ఒక్కో నేతను రోడ్లపై ఉరికిస్తాం. కరీంనగర్ గడ్డపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలను తిరగనీయం" అని హెచ్చరించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందం వల్లే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, డ్రగ్స్ కేసుల్లో ఆధారాలున్నా కేసీఆర్ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేయడం లేదని విమర్శించారు.

ప్రభుత్వ వైఫల్యాలపై భారీ ఎత్తున నిరసనలు చేపడతామని బండి సంజయ్ ప్రకటించారు. మహిళలకు ఇస్తానన్న రూ. 2,500 ఎందుకు ఇవ్వడం లేదో నిలదీస్తాం. వృద్ధులకు రూ. 4 వేల పెన్షన్ కోసం రోడ్లపైకి వస్తాం. నిరుద్యోగులు, రైతులు, విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వానికి సెగ తగిలిస్తాం.

"ఎంఐఎం ఒక జీవం లేని పార్టీ. రజాకార్లు పాకిస్థాన్ వెళ్తూ వదిలేసి వెళ్లిన పార్టీ అది. ముస్లిం మహిళలే ఆ పార్టీని అసహ్యించుకుంటున్నారు. ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం సోదరీమణులంతా మోదీకి జై కొడుతున్నారు" అని పేర్కొన్నారు. భాగ్యనగరాన్ని మూడు ముక్కలు చేసి ఎంఐఎంకు ఇవ్వాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

Tags:    

Similar News