CM Revanth Reddy: నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. 'హంగ్' మున్సిపాలిటీలపై స్పెషల్ ఫోకస్!
CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసిన నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి నేడు మంత్రులతో భేటీ కానున్నారు.
CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసిన నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి నేడు మంత్రులతో భేటీ కానున్నారు. ఎన్నికల ఫలితాల విశ్లేషణ, హంగ్ మున్సిపాలిటీల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటన ముగిసిన నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఆయన మంత్రులు, ముఖ్యులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాష్ట్రంలో వెలువడిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలపై సమావేశంలో చర్చించనున్నారు. మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకున్నప్పటికీ, ఎక్కడైనా ఆశించిన ఫలితాలు రాని చోట దానికి గల కారణాలను విశ్లేషించనున్నారు. ముఖ్యంగా హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ నెల చివరి వారంలో ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల నిర్వహణ, అసెంబ్లీలో ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కోవడం, బడ్జెట్‌లో ప్రవేశపెట్టబోయే కొత్త పథకాలపై ఈ భేటీలో దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పాలనాపరమైన కీలక నిర్ణయాలు, ఇతర ప్రాధాన్యత కలిగిన అంశాలపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఆ భేటీ ముగిసిన వెంటనే సీఎం మీడియా ముందుకు రానున్నారు. మున్సిపల్ ఎన్నికల విజయంపై ప్రజలకు ధన్యవాదాలు తెలపడంతో పాటు, పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టబోయే భవిష్యత్ ప్రణాళికలను ఆయన వెల్లడించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.