Karimnagar: 'ఇంటింటికి సిపిఐ' నిధి సేకరణ ప్రారంభం
Karimnagar: కరీంనగర్‌లో సిపిఐ సామూహిక నిధి సేకరణ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ప్రారంభించారు.
Karimnagar: 'ఇంటింటికి సిపిఐ' నిధి సేకరణ ప్రారంభం
కరీంనగర్: సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం భారత కమ్యూనిస్టు పార్టీ పనిచేస్తుందని, అలాంటి పార్టీకి ప్రజలే వెన్ను దన్నుగా నిలవాలని, వందేళ్లుగా ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్న, సిపిఐ కి విరివిగా ఆర్థిక సహాయాన్ని అందించాలని, సిపిఐ సీనియర్ నాయకులు,మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపుమేరకు ఏప్రిల్ 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఇంటింటికి సిపిఐ సామూహిక నిధి,విరాళాల సేకరణ కార్యక్రమాన్ని స్థానిక గణేష్ నగర్, కమాన్ చౌరస్తాలో సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తో కలిసి చాడ వెంకటరెడ్డి ప్రారంభించారు.
వందేళ్లుగా సిపిఐ ప్రజల కోసమే ఉద్యమాలు నిర్వహిస్తుంది..
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ సమాజంలో అంతరాలు లేని సమ సమాజ స్థాపన కోసం,వర్గ దోపిడీకి వ్యతిరేకంగా, శ్రమనే నమ్ముకొని జీవిస్తున్న కార్మిక వర్గ శ్రేయస్సు కోసం, ప్రపంచ మానవాళికి అన్నం పెట్టే అన్నదాతలకు అండగా నిలవడం కోసం, పేద బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం భారతదేశంలో 1925 డిసెంబర్ 25న సిపిఐ ఆవిర్భవించిందని, నాటినుండి నేటి వరకు వందేళ్లుగా ప్రజా సమస్యలే తమ సమస్యలుగా భావించి పోరాటం చేస్తున్న పార్టీ ఒక్క కమ్యూనిస్టు పార్టీయే నని అన్నారు.
భారత కమ్యూనిస్టు పార్టీని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది..
దేశంలో కమ్యూనిస్టు పార్టీ వల్లనే ప్రజలకు మేలుజరుగుతుందని, రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ,భూ సంస్కరణల చట్టం, అనేక కార్మిక చట్టాలు, గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం ఇలా అనేక ప్రజా ఉపయోగకర చట్టాలు తీసుక రావడం కోసం సిపిఐ అనేక పోరాటాలు చేసిందని తెలిపారు. దేశంలో వారివారి స్వలాభం కోసం, అధికారం కోసం పుట్టుకొచ్చిన పార్టీలు ఎన్నో ఉన్నాయి, కొన్ని పార్టీలు కాలగర్భంలో కలిసి పోయాయి,
కానీ వందేళ్లుగా ప్రజల కోసమే పనిచేస్తున్న, పోరాడుతున్న పార్టీ కేవలం సిపిఐ మాత్రమేనని,ఎన్నో ప్రజోద్యమాలు నిర్వహిస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ ని ఈ దేశంలో కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. కార్యక్రమాల, కార్యాలయాల నిర్వహణ కోసం కమ్యూనిస్టు శ్రేణులకు ఆర్థిక సహాయం అందించి వారికి అండగా నిలవాలని ప్రజలకు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ,కౌన్సిల్ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, కొయ్యడ సృజన్ కుమార్,బోయిని అశోక్, గూడెం లక్ష్మీ,టేకుమల్ల సమ్మయ్య, నాగెల్లి లక్ష్మారెడ్డి, పిట్టల సమ్మయ్య, బోయిని తిరుపతి,న్యాలపట్ల రాజు, పైడిపల్లి రాజు, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, బండ రాజిరెడ్డి, చొక్కల్ల శ్రీశైలం, మావురపు రాజు,మచ్చ రమేష్, బావండ్లపెల్లి యుగేందర్, కొట్టె అంజలి, బూడిద సదాశివ, నగర సిపిఐ నాయకులు బాకం ఆంజనేయులు, నగునూరి రమేష్, కసిరెడ్డి సందీప్ రెడ్డి. మౌలానా తదితరులు పాల్గొన్నారు.