Telangana: నిప్పుల కొలిమిలా తెలంగాణ

Telangana: 11 జిల్లాల్లో 45.4 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదు

Update: 2023-06-07 04:31 GMT

Telangana: నిప్పుల కొలిమిలా తెలంగాణ

Telangana: తెలంగాణ నిప్పుల కొలిమిలా మండిపోతుంది. 11 జిల్లాల్లో 45.4 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 23 మండలాల్లో వడగాలులు నమోదయ్యాయి. 22 మండలాల్లో సాధారణ ఉష్ణోగ్రత కన్నా 4.5 నుంచి 6.4 డిగ్రీల వరకు అధికంగా నమోదు కావడంతో వాతావరణశాఖ వడగాలుల హెచ్చరికలు జారీ చేసింది. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో సాధారణం కన్నా 6.5 డిగ్రీలకుపైగా నమోదు కావడంతో తీవ్రమైన వడగాలులు నమోదైనట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఎక్కువ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారని వాతావరణశాఖ వెల్లడించింది.

గరిష్ఠంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 46.4 డిగ్రీలు నమోదయింది. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌, ములుగు జిల్లా తాడ్వాయి, భద్రాద్రి జిల్లా సీతారాంపురం, మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేటలలో 46 డిగ్రీలకుపైగా నమోదయింది. సూర్యాపేట, భద్రాద్రి, ములుగు, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్​ జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఈ ఏడాది ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపై సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. అయిదు రోజులుగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 46 డిగ్రీలను దాటడంతో వేడి భరించలేని పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే ఏడు రోజులు రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు నమోదయ్యే సూచనలున్నట్లు వాతావరణశాఖ ప్రకటించింది. హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాల్లో 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని సూచించింది.

రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదిలేందుకు పరిస్థితులు మెరుగయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 10 నాటికి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే చాన్స్ ఉందని పేర్కొంది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో తుఫాను కేంద్రీకృతమై ఉందని, దాని వల్ల రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదిలేందుకు అవకాశం ఏర్పడిందని చెప్పింది. మంగళవారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. 

Tags:    

Similar News