తెలంగాణ రాజకీయాల్లో సెప్టెంబర్ 17 సెగ.. పోటాపోటీగా సభలు నిర్వహించేందుకు పార్టీల ప్లాన్
Telangana: జాతీయ సమైక్యతా దినోత్సవం పేరుతో బీఆర్ఎస్ కార్యక్రమాలు
తెలంగాణ రాజకీయాల్లో సెప్టెంబర్ 17 సెగ.. పోటాపోటీగా సభలు నిర్వహించేందుకు పార్టీల ప్లాన్
Telangana: తెలంగాణ రాజకీయాల్లో సెప్టెంబర్ సెవెన్‌టీన్ సెగ రాజుకుంది. అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీగా బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. హైదరాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో సభ నిర్వహించేందుకు బీజేపీ రెడీ అవుతోంది. చీఫ్ గెస్ట్‌గా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం పేరుతో వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నెల 17నే భారీ బహిరంగ సభకు హస్తం పార్టీ ప్రణాళిక రచిస్తోంది. ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా జాతీయ సమైక్యతా దినోత్సవం పేరిట కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది.
సెప్టెంబర్ 17న తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన రోజుగా వేడుకలు నిర్వహిస్తారు. ఎన్నికలు సమీపిస్తున్న టైమ్‌లో తెలంగాణలో రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబర్ 17 టార్గెట్‌గా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. జాతీయ సమైక్యత దినోత్సవం పేరుతో అధికార పార్టీ కార్యక్రమాలు నిర్వహించబోతుంది. హైదరాబాద్‌లో నిర్వహించే వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. జాతీయ పార్టీలకు పోటీగా రంగారెడ్డి ప్రాజెక్టు ఓపెనింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 16న కల్వకుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
మరో వైపు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇటు పార్టీలో చేరికలతో జోష్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ సైతం సెప్టెంబర్ 17ను తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం పేరిట వేడుకలకు ప్లాన్ చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ హైదరాబాద్ కేంద్రంగా భారీ కార్యక్రమాలకు అన్ని పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి.
మరోవైపు హైదరాబాద్ వేదికగా జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు రానున్నారు. ఇటు బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీల సభలకు హైదరాబాద్ వేదికకానుంది. మొత్తానికి తెలంగాణలో అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. సెప్టెంబర్ 17ను అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీ సమావేశాలు, సభలతో టెన్షన్ నెలకొంది. ఒకే రోజు మూడు ప్రధాన పార్టీల సభలు ఉన్నాయి. ప్రజల్లో పట్టు సాధించి, తామే చాంపియన్ అనిపించుకోవాలని అన్నిపార్టీలు పోటీపడుతున్నాయి.