Telangana Municipal Elections 2021: ప్రారంభమైన తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్

Telangana Municipal Elections 2021: తెలంగాణలో ఐదు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమయింది.

Update: 2021-04-30 02:52 GMT

Telangana Municipal Elections 2021:(File Image)

Telangana Municipal Elections 2021: తెలంగాణలో ఐదు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, కొత్తూర్, జడ్చర్ల మున్సిపాలిటీలతో పాటు నల్గొండ, గజ్వేల్, పరకాల, బోధన్లలో ఏర్పడిన ఖాళీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 1,539 పోలింగ్ కేంద్రాలు, 2,500 బ్యాలెట్ బ్యాక్స్‌లను ఏర్పాటు చేశారు. 9,809 మంది సిబ్బందిని ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మొత్తం 11.34 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కువగా 878 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అతి తక్కువగా కొత్తూర్ మున్సిపాలిటీలో 12 కేంద్రాలు ఉన్నాయి.

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. మాస్క్ లేనిదే పోలింగ్ కేంద్రానికి ఎవ్వరినీ అనుమతించడం లేదు. . ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ శానిటైజర్లు ఏర్పాటు చేశారు. ఓటర్లు క్యూలైన్లలో భౌతిక దూరం పాటించేలా అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ఇక ఎన్నికల సిబ్బందికి ఫేస్ మాస్కులతో పాటు ఫేస్ షీల్డ్, శానిటైజర్లను అందజేశారు. పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి ఒక్కొక్కరికి రెండు మాస్కుల చొప్పున 28,810 మాస్కులు, 14,505 ఫేస్ షీల్డ్లు, 22,910 గ్లోవ్స్, 18,455 శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. ఈ ఎన్నికలకు మొత్తం 4,577 మంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. 336 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించిన అధికారులు.. అక్కడ మరింత పటిష్టంగా భద్రతా ఏర్పాటు చేశారు. ఇక ఓట్ల లెక్కింపు తర్వాత విజయోత్స వేడుకలు, ర్యాలీలపై నిషేధం విధిస్తున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎఫిక్ కార్డుతో సహా 18 రకాల గుర్తింపు కార్డులకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈ కార్డుల్లో ఫొటోతో పాటు చిరునామా సరిగా ఉండాలని పేర్కొంది.

Tags:    

Similar News