ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న తెలంగాణ.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు రేపు పడేనా?

Telangana Financial Crisis: కేంద్రం నుంచి అప్పులకు పర్మిషన్ రాకపోవడంతో... నిధుల సర్దుబాటుపై అధికారులు తర్జనభర్జన

Update: 2022-05-31 06:37 GMT

ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న తెలంగాణ.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు రేపు పడేనా?

Telangana Financial Crisis: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై అధికారులు నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. వచ్చే మూడు నెలల ఆదాయం ఎలా? ఏ ఏ మార్గాల ద్వారా ఆదాయం రాబట్టుకోవాలి పథకాల అమలు ఎలా చేయాలన్నదానిపై కేసీఆర్ సర్కారు తర్జనభర్జన పడుతుంది. పెరిగిన మద్యం ధరలతో వచ్చే ఆదాయమే ప్రభుత్వ పథకాలకు భరోసా ఇస్తాయా? లేదంటే మనుగడ ఎలా అన్నదానిపై సర్కారు ఉక్కిరిబిక్కిరవుతోంది.

ఎన్నికల సమయంలో ఇచ్చిన పథకాలే కాకుండా కొత్త వాటిని అమలు చేస్తోంది కేసీఆర్ సర్కారు. దేశంలోనే అద్భుత స్కీం అంటూ సీఎం కేసీఆర్ ఇటీవల దళిత బంధు ప్రకటించారు. ఐతే ఈ పథకానికి నిధుల కొరత తప్పడం లేదు. రెండో విడతలో భాగంగా ఒక్కో నియోజకవర్గం నుంచి పదిహేను వందల మందికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇప్పటివరకు కేవలం వంద కుటుంబాలకు మాత్రమే దళిత బంధు అందినట్లు సంబంధిత అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాదిలో దళిత బంధు కోసం 17 వేల కోట్లు కేటాయించింది సర్కార్.  అయితే ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోవడంతో నిధుల సర్దుబాటు ఎలా చేయాలో అర్థం కావడం లేదంటున్నారు అధికారులు. తక్షణ సహాయం కింద కనీసం మూడు వేల కోట్లు అయిన మంజూరు చేయాలని సెంట్రల్  ఫైనాన్స్ అధికారులతో రాష్ట్ర  ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణ రావు పలుమార్లు సమావేశం నిర్వహించిన ఫలితం లభించలేదు.

రైతులకు రైతు బంధు పెట్టుబడి సాయాన్ని ఈసారి త్వరగానే అందించేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు ప్రారంభించింది. జూన్‌ మొదటి వారంలో వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతుబంధు సాయాన్ని పంపిణీ చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలోని 66.61 లక్షల మంది రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారం వ్యవసాయ శాఖ వద్ద ఇప్పటికే ఉంది. ఈ డేటాను అప్‌డేట్‌ చేయటం, కొత్త లబ్ధిదారులకు అవకాశం కల్పించటం తదితర పనులపై వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి సారించారు. జూన్‌ నెల ఒకటో తేదీ నుంచే వానాకాలం సీజన్‌ ప్రారంభం అవుతుంది. దీంతో సీజన్‌ మొదలుకాగానే మొదటి వారంలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమచేయాలని సర్కార్ భావిస్తోంది. ఈసారి రైతుబంధు కోసం 8 వేల కోట్ల రూపాయలు అసవరం కానున్నాయి. అయితే మొదటి వారంలోనే వేయాలనుకున్న రైతు బంధు కచ్చితంగా ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు.

ఈసారి బడ్జెట్‌లో ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించకపోయిన గతంలో ఉన్న వాటినే అమలు చేయనున్నట్లు చెప్పింది. అందులో ప్రధానంగా సొంత స్థలం ఉన్న వాళ్లకు ఇళ్ళు కట్టుకోవడానికి మూడు లక్షల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పింది. ఇందుకోసం 12 వేల కోట్లు కేటాయించింది. కానీ ఇప్పటివరకు అర్హులను గుర్తించడానికి ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాలేదు. ఇక కొత్తగా ఆసరా పెన్షన్ల కోసం 14 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఏప్రిల్ నుండి కొత్త పెన్షన్లను అమలు చేస్తామని అసెంబ్లీలో సీఎం ప్రకటన చేశారు. దానిపై కూడా ఏలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్త స్కీంలు మొదలు కాక పాత వాటిని అమలు చేయలేకపోవడంతో ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంది. ఆసరా, దళిత బంధు , రైతు బంధు స్కీంలపై ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారట.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ధరలు పెరగడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం చేకూరింది. రాష్ట్ర వ్యాప్తంగా 2620 వైన్ షాప్స్, 1100 బార్లు వీటితో ఉండగా 2021 -22 సంవత్సరానికి 31 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి ఆదాయం చేకూరింది. 2019 నుంచి 2021 సంవత్సరంలో మద్యం విక్రయాల ద్వారా 54 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. పెంచిన ధరలతో రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు 180 కోట్ల రాబడి రానుంది. సంవత్సరానికి 35 వేల కోట్ల ఆదాయం వస్తోందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మొన్న పెంచిన మద్యం ధరలతో సర్కారుకు దాదాపు ఏడు వేల కోట్ల ఆదాయం సమకూరనుంది. ప్రస్తుతం ప్రభుత్వన్నీ ఇదే గట్టెక్కించనుంది. ఐనా ఈ ఆదాయం కూడా సరిపోయేలా కన్పించడం లేదు. గత మూడు నాలుగు నెలల నుంచి పింఛన్లు, జీతాలు ఆలస్యంగా ఇస్తోంది ప్రభుత్వం. అటు కేంద్రం సహకారం అందదు అటు రాబడి పెరగక ప్రభుత్వం తలపట్టుకుంటోంది.

Tags:    

Similar News