ఈనెల 30న తెలంగాణ కేబినెట్..లాక్‌డౌన్‌ పొడిగింపుపై చర్చించనున్న కేబినెట్

Telangana Cabinet: తెలంగాణలో మరో నాలుగు రోజుల్లో లాక్‌డౌన్ ముగియనుంది.

Update: 2021-05-26 13:56 GMT

కెసిఆర్ ఫైల్ ఫోటో 

Telangana Cabinet: తెలంగాణలో మరో నాలుగు రోజుల్లో లాక్‌డౌన్ ముగియనుంది. దీంతో లాక్‌డౌన్ కంటిన్యూ చేస్తారా లేదా అన్నది హాట్‌టాపిక్‌గా మారింది. ఇలాంటి సమయంలో లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునేందుకు కేబినెట్ భేటీకి టైమ్ ఫిక్స్ అయింది. ఈనెల 30న లాక్‌డౌన్ సహా పలు అంశాలపై మంత్రులు కీలకంగా చర్చించనున్నారు.

తెలంగాణలో లాక్‌డౌన్ విధించక ముందు రోజువారీ కేసులు 8వేల చొప్పున నమోదయ్యేవి. ఈ క్రమంలో సర్కార్ లాక్‌డౌన్ ప్రకటించడం, కట్టుదిట్టంగా అమలు చేయడంతో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. తాజాగా రోజువారీ కేసులు భారీగా తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్ పొడిగిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

మే 30న మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో వ్యవసాయం, పంటలు, కొనసాగుతున్న ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిర్మూలన, కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ పొడిగింపు తదితర అంశాల మీద చర్చ జరపనున్నారు. గతంలో కంటే కేసులలో తగ్గుదల కనిపిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగింపుపై ఈ భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఈ భేటీలో వ్యవసాయం, పంటలు, ధాన్యం సేకరణ, విత్తనాల పంపిణీపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఒక పక్క లాక్‌డౌన్ అమలవుతుండగానే 70శాతం ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన ధాన్యాన్ని కూడా వారం రోజుల్లో కొననున్నారు. అటు.. రైతులకు లాభాలు వచ్చే పంటలు వేయాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. తెలంగాణలోని చెరువులన్నీ నిండుగా మారిన నేపధ్యంలో రైతులు వరి పండించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే.. పత్తి పంట లాభసాటిగా ఉండనుంది రైతులకు వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.

మరోవైపు.. బ్లాక్ పంగస్ వైట్ పంగస్ కేసులు పెరుగుతుండడం తో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1500 బెడ్స్ ని సిద్ధంగా ఉంచారు. మరోవైపు థర్డ్ వేవ్.. దాన్ని ఎదుర్కోవడం తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ లాక్‌డౌన్ కంటిన్యూ చేస్తే ఆర్థిక పరిస్థితులు ఏంటి అన్న దానిపై ప్రభుత్వం ఓ క్లారిటీకి రానుంది. పూర్తిస్థాయి లాక్‌డౌన్ కాకుండా మరిన్ని సడలింపులు ఇస్తే పరిస్థితి ఏంటి అన్న దానిపై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంతలేదన్న మరో వారం లాక్‌డౌన్ పొడిగింపు పైనే నిర్ణయం తీసుకుంటుంది అన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అయితే.. పాజిటివ్ కేసులు తగ్గుతున్న నేపధ్యంలో వ్యవసాయ శాఖకి సడలింపులు ఇస్తారా అనేదానిపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు.

Tags:    

Similar News