రేపు తెలంగాణ మంత్రివర్గం సమావేశం

CM KCR: FRBM పరిధిలోపు అప్పులు తెచ్చుకుంటామంటున్న కేసీఆర్

Update: 2022-08-10 01:28 GMT

రేపు తెలంగాణ మంత్రివర్గం సమావేశం 

CM KCR: రేపు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగనుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో ఆర్థిక వనరుల సమీకరణపై చర్చించనున్నారు. FRBM పరిమితి మేరకు అప్పులు తెచ్చుకునే విధంగా అవకాశం ఇవ్వాలని గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూ వస్తోంది. అయితే ఆ మధ్య వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకొచ్చిన అప్పులను కూడా బడ్జెట్‌ లో చూపించాలని అవి కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పల్లో భాగమే అంటూ కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై భగ్గుమన్న కేసీఆర్ కేంద్రంలోని మోడీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కేంద్రం ఆంక్షలు శతృదేశాలపై విధించిన తరహాలో ఉన్నాయంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. కేంద్రం విధించిన ఆంక్షలతో దాదాపు 15 వేల కోట్లు కోత పడిందని తెలిపారు.

ఇప్పటికే నిధుల సమీకరణపై ఆర్థికమంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఇందుకు సంబంధించి కసరత్తు కూడా చేస్తోంది. ఈ ఉపసంఘం ఇచ్చే నివేదికపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే నిరుపయోగంగా ఉన్న భూముల అమ్మకం, పన్నేతర ఆదాయం పెంచుకునే విధంగా ఆలోచనలు చేసిన ప్రభుత్వం. మరిన్ని ఆదాయ మార్గాలను అన్వేషించనుంది. ఇక ఇప్పటికే కేసీఆర్ ప్రకటించిన కొత్త పింఛన్లు, డయాలసిస్ పేషెంట్లకు ఆసరా పెన్షన్లు, వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కూడా కేబినెట్ చర్చించనుంది.

ఇక మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయిన నేపథ్యంలో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించనున్నారు. షెడ్యూల్ విడుదలయ్యేలోపే అభివృద్ధి కార్యక్రమాలపై ఆమోదం తెలపనున్నారు. పార్టీ వ్యూహం, హ‍ుజురాబాద్‌ విషయంలో జరిగిన తప్పిదాలను కూడా చర్చించే అవకాశం ఉంది. ఉపఎన్నిక బాధ్యతను ఎవరికి అప్పగించాలనేదానిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News