Telangana Budget 2025: సన్న వడ్లకు రూ. 500 బోనస్... రైతుల ఖాతాల్లో 1,206.44 కోట్లు జమ
Telangana Budget 2025 - Rs 500 bonus for farmers : సన్న వడ్లకు రూ. 500 బోనస్... రైతుల ఖాతాల్లో 1206.44 కోట్లు జమ
Telangana Budget 2025 allotments towards Agriculture : రాష్ట్రంలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో సన్న వడ్లు పండించే రైతులకు ప్రతి క్వింటాలుకు రూ. 500 బోనస్ కూడా ఒకటి. తాజాగా తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ సన్న వడ్లకు బోనస్ చెల్లింపు వివరాలను వెల్లడించారు.
సన్న వడ్లు పండించే రైతులకు బోనస్ చెల్లించడం వల్ల గత ఖరీఫ్‌తో పోల్చితే ఈసారి సన్న వడ్ల సాగు 25 లక్షల ఎకరాల నుండి 40 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. గత ఖరీఫ్ సీజన్‌లో సన్న వడ్లు పండించిన రైతుల ఖాతాల్లో రూ. 1206.44 కోట్ల రూపాయలు జమ చేసినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 8,332 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు.
ఖరీఫ్ సీజన్ లో 10,35,484 మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి వారి ఖాతాల్లో రూ. 12,511.76 కోట్లు జమ చేసినట్లు చెప్పారు.
ధాన్యాన్ని మార్కెట్ కు తరలించే రైతులు అకాల వర్షాలతో నష్టపోకుండా రూ.181.98 కోట్ల నిధులతో మార్కెట్ యార్డులు అభివృద్ధి చేస్తున్నామన్నారు. గంటగంటకు అటు రైతులకు ఇటు కొనుగోలు కేంద్రాలకు వాతావరణ సూచనలు అందిస్తున్నట్లు చెప్పారు.
వ్యవసాయ శాఖ నిర్వహణ కోసం ఈ ఏడాది బడ్జెట్ లో రూ. 24,439 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
రైతులకు ప్రోత్సాహకాలు
రాష్ట్రంలో పామ్ ఆయిల్ పంటలను పండించే రైతులను ప్రోత్సహించడం కోసం సబ్సీడీల రూపంలో వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు భట్టి చెప్పారు. అలాగే ఉద్యానవన పంటల సాగులో డ్రిప్ ఇరిగేషన్ ఉపయోగించే వారు సౌర విద్యుత్ ఉపయోగించుకునేలా సబ్సీడీలు అందిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలను కూడా రైతులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.