తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ బడ్జెట్... గతేడాదికంటే పెరిగిందా, లేక తగ్గిందా?

Telangana Budget 2025 allotments for Health: 2023-24 ఏడాదిలో బీఆర్ఎస్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకు

Update: 2025-03-19 08:35 GMT

Telangana Budget 2025 allotments for Health sector: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకు బడ్జెట్ కేటాయింపులు... గతేడాదికంటే పెరిగిందా, లేక తగ్గిందా? 

Telangana Budget 2025 allotments for Health : వైద్య ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఇవాళ అసంంబ్లీలో తెలంగాణ బడ్జెట్ 2025 ప్రవేశపెట్టిన ఆయన వైద్య ఆరోగ్య రంగానికి కేటాయింపులు, అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ పథకం కింద వివిధ ఆస్పత్రులకు రూ. 1,215 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. గత సంవత్సరాల కంటే ఇది 50 శాతం ఎక్కువ అని తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద తెలంగాణకు ఎక్కువ నిధులు రాబట్టేందుకు వీలుగా తెలంగాణ వాటాను ఎప్పటికప్పుడు విడుదల చేశామన్నారు.

102 ఉచిత డయాలసిస్ సెంటర్లు

రాష్ట్రవ్యాప్తంగా 102 కేంద్రాల ద్వారా ఉచిత డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసి లక్షకుపైగా డయాలసిస్ రోగులకు ఉచితంగా సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఉచిత సేవల ద్వారా రోగులపై రూ. 948 కోట్ల అదనపు భారం తగ్గిందని అన్నారు. ఈ ఉచిత డయాలసిస్ సేవలను మరింత మందికి అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో కొత్తగా మరో 95 డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. అంబులెన్స్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల కోసం కొత్తగా 136 కొత్త అంబులెన్సులను అందించామన్నారు.

కొత్తగా ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో 400 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా 16 నర్సింగ్ కాలేజీలు, 28 అనుబంధ హెల్త్ సైన్స్ కాలేజీల ద్వారా ప్రతీ సంవత్సరం 2,640 మంది వైద్య విద్యార్థులకు విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

100 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న ఉస్మానియా ఆస్పత్రిని అభివృద్ధి చేయడం కోసం ఇటీవలే 27 ఎకరాల విస్తీర్ణంలో రూ.2700 కోట్లతో అత్యాధునిక వైద్య సదుపాయాలతో కొత్త భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తుచేశారు. మొత్తంగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నిర్వహణ కోసం బడ్జెట్ 2025 లో రూ. 12,393 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు భట్టి విక్రమార్క చెప్పారు.

గతేడాదితో పోల్చుకుంటే ఈసారి తెలంగాణ హెల్త్ బడ్జెట్...

2023-24 ఏడాదిలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకు రూ. 12,161 కోట్లు కేటాయించింది. ఈ కేటాయింపులు వైద్య ఆరోగ్య శాఖ అవసరాలకు సరిపోవని అప్పటి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. ఆ తరువాత ఏడాది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2024-25 బడ్జెట్ లో వైద్య ఆరోగ్య శాఖకు రూ. 11,468 కోట్లు కేటాయించింది. అది అంతకుముందు ఏడాది కంటే రూ. 693 కోట్లు తక్కువ. దీంతో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇదే అంశాన్ని లేవనెత్తుతూ తమ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని ఆరోపించింది.

ఇదిలాఉండగా తాజాగా ఈ ఏడాది బడ్జెట్ లో రేవంత్ రెడ్డి సర్కారు ఆరోగ్య శాఖ బడ్జెట్ ను రూ. 12,393 గా ప్రతిపాదించారు. ఇది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చివరి ఏడాదిలో ఆరోగ్య శాఖకు కేటాయించినదానికంటే రూ. 232 కోట్లు ఎక్కువ. 

Full View

Tags:    

Similar News