Huzurabad: రోజురోజుకు ఉత్కంఠ పెంచుతున్న హుజూరాబాద్ బైపోల్‌ వార్‌

Huzurabad: బీజేపీ, టీఆర్ఎస్‌ దూకుడుతో రసవత్తరంగా మారిన రాజకీయం * పార్టీల గెలుపు వ్యూహాలతో ఆసక్తి రేపుతున్న ఉపఎన్నిక

Update: 2021-07-19 05:35 GMT

బీజేపీ మరియు టీఆర్ఎస్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Huzurabad: హుజూరాబాద్ బైపోల్‌ వార్‌ రోజురోజుకు ఉత్కంఠ పెంచుతుంది. బీజేపీ, టీఆర్ఎస్‌ దూకుడుతో రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుంది. ఎవరికి వారు గెలుపు వ్యూహాలు రచించుకుంటూ ఆసక్తి పెంచుతున్నారు. ఉప ఎన్నిక టార్గెట్‌‌గా ఈటల రాజేందర్‌ బీజేపీ నేతలతో కలిసి 23లో పాటు పాదయాత్ర చేయనున్నారు. ప్రజాదీవెన పేరుతో 127 గ్రామాలలో 350 కిలోమీటర్లు పాదయాత్ర మొదలు పెట్టాడు. మరోవైపు ఈటలను ఏకాకిని చేయడానికి టీఆర్ఎస్ భారీ స్కెచ్ వేసింది. విద్యార్థి జేఏసీ పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది.

ఇప్పటికే నియోజకవర్గంలోని మండలాలకు, గ్రామాలకు ఇన్‌చార్జులను నియమించిన టీఆర్ఎస్ ఇప్పుడు గ్రామగ్రామాన ప్రచారం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 7 బస్సుల్లో 100 మంది విద్యార్థులతో నియోజకవర్గంలోని 5 మండలాలు, 2 మున్సిపాలిటీలను కవర్ చేసేలా 20 రోజుల కార్యాచరణను పార్టీ నాయకత్వం ఖరారు చేసింది. ఉస్మానియా వర్శిటీకి చెందిన పన్నెండు విద్యార్థి సంఘాలు జేఏసీగా ఏర్పడి హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడమే లక్ష్యంగా యాత్ర చేపట్టారు. కేవలం హుజూరాబాద్ నియోజకవర్గానికే ఈ యాత్ర పరిమితం కానుంది. టీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని వివరించడంతో పాటు కేంద్రం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ఎండగట్టడం ఈ యాత్ర ఉద్దేశం. ప్రస్తుతం ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో ఆ పార్టీపైనే బాణం ఎక్కు పెట్టాలనుకుంటున్నారు. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి ఆపరేషన్‌ ఆకర్ష్‌ను సక్సెస్‌ ఫూల్‌గా అమలు చేస్తున్నారు.

ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఢిల్లీ పెద్దలను హుజురాబాద్ కు పిలిపించబోతున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, హోమ్ మంత్రి అమిత్ షాను పర్యటన దాదాపు ఖరానైనట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలు హుజురాబాద్‌లొనే మకాం వేశారు. ఈటల పాదయాత్రలో పాల్గొననున్నారు. మరోవైపు వచ్చే నెల 9 నుంచి బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక తెలంగాణ కాంగ్రెస్ కొత్త సారధి రేవంత్ రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నిక ఇంఛార్జిగా దామోదర రాజా నర్సింహ ను నియమించారు. మండలాలకు భాద్యులను నియమించారు. ఇలా ఎవరి వ్యూహాలతో వారు ముందుకెళ్తున్నారు.

Tags:    

Similar News