Telangana: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళనపై స్పెషల్ ఫోకస్
Telangana: బోగస్ ఓటర్లు, మరణించిన వారి పేర్లను తొలగించే అంశానికి ప్రాధాన్యత
Telangana: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళనపై స్పెషల్ ఫోకస్
Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళనపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఎలక్షన్ కమిషన్. బోగస్ ఓటర్ల ఏరివేతతో పాటు.. మరణించిన వారి పేర్లను తొలగించే అంశాలకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్ర అధికారులకు ఈ అంశంపై పలు సూచనలు చేశారు. బూత్ లెవల్ ఆఫీసర్లకు ఓటర్ల జాబితా ప్రక్షాళన బాధ్యతలను ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ఆ దిశగా రాష్ట్ర ఎన్నికల కార్యాలయం కసరత్తు ప్రారంభించింది.
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రక్షాళన విషయంలో స్థానిక సంస్థలతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం టై అప్ అవ్వాలని తెలిపింది. మరణించిన వారి వివరాలను మున్సిపాలిటీ, పంచాయతీ కార్యాలయాల నుంచి సేకరించి ఓట్లను తొలగించాలని ఆదేశించింది. దీంతో పాటు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల పేర్లను పరిశీలించాలని తెలిపింది. జిల్లాల కలెక్టర్లు ఓటర్ల జాబితా ప్రక్షాళన విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. తమ పోలింగ్ కేంద్రం పరిధిలో బోగస్ ఓట్ల ఏరివేతపై బూత్ లెవల్ ఆఫీసర్లు ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు కసరత్తు చేస్తున్న ఎన్నికల అధికారులు.. బూత్ లెవల్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు.
ఓటర్ల జాబితా ప్రక్షాళన సందర్భంగా బోగస్ ఓట్లు తొలగించడం ఎంత ముఖ్యమో.. అర్హులైన వారు ఓట్లు కోల్పోకుండా చర్యలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని ఈసీఐ అధికారులు స్పష్టం చేశారు. ఇక యువ ఓటర్ల సంఖ్యను పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సూచించారు. 18 ఏళ్లు దాటిన వారిని గుర్తించి ఓటర్ల జాబితాలో చేర్చే బాధ్యతను క్షేత్రస్థాయి అధికారులకు అప్పగించింది. యువ ఓటర్ల నమోదు కోసం కాలేజీల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం.