విద్యా భారతి స్కూళ్లల్లో విద్యనభ్యసించిన వారికి సంస్కారంతో పాటు నైతిక, జీవన విలువలు పెంపొందుతాయని ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ ఛాలక్ మోహన్ భగవత్ చెప్పారు. సరస్వతి శిశుమందిర్ పూర్వవిద్యార్థులు, అధ్యాపకుల సమ్మేళనంలో పాల్గొన్న ఆయన విలువలను జీవితాంతం పాటించాలని శక్తిమేరకు సమాజానికి సేవ చేయాలని కోరారు.
హైదరాబాద్ బండ్లగూడ జాగీర్‌లోని శారదాధామంలో సరస్వతి శిశుమందిర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కన్నులపండువగా నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన పూర్వ విద్యార్థులు, అధ్యాపకులకు ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ ఛాలక్ మోహన్ భగవత్ హాజరై విలువైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పౌరసత్వ చట్టంపై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఆందోళనలపై స్పందించారు. అక్రమంగా దేశంలోకి వచ్చి ప్రమాదకరంగా మారిన వారిని బయటకు పంపించడం సమంజసమని తెలిపారు.
దేశం కోసం బలిదానాలు చేసిన వారు చరిత్రలో ఉన్నారని.. మోహన్ భగవత్ అన్నారు. వ్యక్తికి ఎప్పుడూ తానొక్కడినే అన్న భావన కలగరాదని, తనకు తానూ ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలని చెప్పారు. విద్యాభారతిలో అభ్యసించిన విద్యార్థులకు నైతిక, జీవన విలువలు పెంపొందుతున్నాయని,అది రక్తసంబంధంలో కూడా ఉండకపోవచ్చని తెలిపారు. సన్మార్గంలో నడవాలని స్వలాభం కోసం కాకుండా దేశసేవ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.
వేలాదిగా తరలివచ్చిన అధ్యాపకులు, విద్యార్థులు ఈ సందర్భంగా గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఒకరితో మరొకరు సంతోషంగా గడిపారు. ప్రపంచంలోనే ఎక్కువమంది పూర్వ విద్యార్థులు హాజరైన సమ్మేళనంగా ఇది రికార్డులకెక్కింది.