Karimnagar: సురక్షిత ప్రయాణం.. సుఖమయ జీవనం ట్రాఫిక్ నిబంధనలపై సీపీ సమీక్ష
Karimnagar: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కరీంనగర్ సీపీ గౌష్ ఆలం 'ARRIVE – ALIVE' కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.
Karimnagar: సురక్షిత ప్రయాణం.. సుఖమయ జీవనం ట్రాఫిక్ నిబంధనలపై సీపీ సమీక్ష
Karimnagar: రోడ్డు ప్రమాదాల రహిత సమాజమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ARRIVE – ALIVE” రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ అమలుపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. "ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక" లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణలో భాగంగా, ఈ నెల 13 నుండి 18వ తేదీ వరకు వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు సీపీ వెల్లడించారు.
వారం రోజుల కార్యాచరణ ముఖ్యాంశాలు:
సమీక్షా సమావేశంలో సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ, వారం రోజుల పాటు రోజుకో ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ప్రధానాంశాలు:
మొదటిరోజు (13వతేది సోమవారంనాడు) గ్రామ స్థాయి కమిటీలు: ప్రతి గ్రామంలో రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేసి, స్థానిక ప్రజలకు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించడం. (14వతేది మంగళవారంనాడు)రెండవరోజు ప్రమాణ స్వీకారం: వాహనదారులు, విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా సామూహిక ప్రమాణ స్వీకార కార్యక్రమాలు చేపట్టడం.
(15వతేది బుధవారంనాడు) మూడవరోజు బ్లాక్ స్పాట్స్ గుర్తింపు: ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి, అక్కడ తక్షణమే హెచ్చరిక బోర్డులు, జీబ్రా క్రాసింగ్స్ మరియు రోడ్ మార్కింగ్స్‌ను పునరుద్ధరించడం.
(16వతేది గురువారంనాడు) నాల్గవరోజు విద్యార్థులకు అవగాహన: పాఠశాలల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు, చిన్నతనం నుంచే ట్రాఫిక్ క్రమశిక్షణ అలవడేలా విద్యార్థులకు అవగాహన కల్పించడం. ఆటో, బస్సు, లారీ డ్రైవర్లకు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించి, హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ ప్రాముఖ్యతను వివరించడం.
(17వతేది శుక్రవారంనాడు)ఐదవరోజు గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత: ప్రమాదం జరిగిన మొదటి గంట (గోల్డెన్ అవర్) లో బాధితులకు అందించాల్సిన ప్రాథమిక చికిత్స, సహాయంపై ప్రజలకు వివరించడం. (18వతేది శనివారంనాడు)ఆరవరోజు: నో ఫైన్ డే: వారంలో ఒక రోజు ట్రాఫిక్ ఉల్లంఘనలపై జరిమానాలు విధించకుండా, కేవలం కౌన్సెలింగ్ ద్వారా వాహనదారుల్లో మార్పు తీసుకురావడం.
ప్రజల సహకారం అనివార్యం:
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. "రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత. నిబంధనల పట్ల నిర్లక్ష్యం ప్రాణనష్టానికి దారితీస్తుంది. 'ARRIVE – ALIVE' లక్ష్యం నెరవేరాలంటే డ్రైవర్లు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలి," అని పిలుపునిచ్చారు. సురక్షిత ప్రయాణం – సుఖమయ జీవనం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.