Rice Price: సన్నబియ్యం ధరలకు రెక్కలు.. కొనలేక జనం సతమతం

Rice Price: మంచిర్యాలలో 65 శాతం దొడ్డు రకం ధాన్యం సాగు

Update: 2023-09-17 15:30 GMT

Rice Price: సన్నబియ్యం ధరలకు రెక్కలు.. కొనలేక జనం సతమతం

Rice Price: సన్నబియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. మొన్నటి దాక కూరగాయల ధరలు మండిపోయాయి. ఇప్పుడు బియ్యం ధరలు పెరిగాయి. దీంతో జనం సన్న బియ్యం కొనలేక సతమతమవుతున్నారు. మంచిర్యాల జిల్లాలో గతేడాది కంటే ఈసారి క్వింటాలుకు 800 రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు పెరిగింది. జిల్లాలో 65 శాతం దొడ్డు రకం వరి సాగవుతుండగా... సన్నరకం వరి 35 శాతమే సాగవుతోంది. దీంతో సన్నాల సాగు తగ్గి... బియ్యం కొరత ఏర్పడగా.. వ్యాపారులు క్రమక్రమంగా ధరలు పెంచేస్తున్నారు.

సన్న బియ్యం ధరల నియంత్రణపై అధికారులు దృష్టి సారించడంలేదనే ఆరోపణలున్నాయి. ప్రతి నెలా ఉన్నతాధికారులు ధరల నియంత్రణపై సమావేశం నిర్వహించి.... ధరలు, క్రయవిక్రయాలపై చర్చించాలి. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకోవాలి. ధరలు మరింత పెరిగే అవకాశముంటే ప్రభుత్వ పరంగా కేంద్రాలు ఏర్పాటు చేసి విక్రయించాలి. కానీ.. జిల్లాలో అవేమీ కనిపించకపోవడంతోనే వ్యాపారులు రైతుల నుంచి క్వింటాలు వరి ధ్యాన్యాన్ని 2 వేల 500 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. మిల్లులో వడ్లను నూర్పిడి చేసిన తర్వాత క్వింటాలు బియ్యాన్ని 5 వేల 800 రూపాయలకు విక్రయించి లాభపడుతున్నారు. అధికారులు పర్యవేక్షించి బియ్యం ధరలు నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.

దీంతో కష్టపడి ధాన్యం పండించిన రైతుల కంటే.... వడ్లు కొనుగోలు చేసి.. బియ్యం విక్రయించి వ్యాపారులు లాభాలు గడిస్తున్నారు. సన్నరకం వరి సాగు చేస్తే తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుంది. నివారణకు రైతులు పలు దఫాలు క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తుండడంతో పెట్టుబడి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. పైగా దిగుబడి కూడా దొడ్డు రకం కంటే తక్కువగా వస్తోంది.

దీంతో బియ్యం ధరలు పెంచి విక్రయిస్తామంటున్నారు వ్యాపారులు...

పండిన కొద్దిపాటి పంటకు మార్కెట్లో గిటుబాటు ధర లేక రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దొడ్డు రకం వడ్లను ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి, మద్దతు ధర చెల్లిస్తోంది. దీంతో చాలామంది రైతులు దొడ్డు రకం సాగుకే మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల కూడా సన్న రకాల బియ్యానికి డిమాండ్ పెరిగి ధర కూడా పెరుగుతూ వస్తోందంటున్నారు వ్యాపారులు..

ఏదేమైనా సన్న రకం వడ్లు సాగు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.. అటు రైతులను ఆదుకోవాలి... ఇటు వినియోగదారులను ప్రభుత్వం ఆదుకోవాల్సిందే.

Tags:    

Similar News